calender_icon.png 21 March, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం

21-03-2025 06:34:17 PM

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయకాంతి): పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో 6560 మంది విద్యార్థులు మొదటి రోజు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా 6531 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.29 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారు. 

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్...

 జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dotre) పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల కొరకు 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,కేంద్రాలలో విద్యార్థుల కొరకు ఫర్నిచర్, ఫ్యాన్లు, వెలుతురు, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య-ఆరోగ్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని తెలిపారు.  ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు, ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.