28-02-2025 01:46:28 AM
93.03 శాతం పోలింగ్
4089 ఓట్లకు 3804 మంది ఓటు హక్కు వినియోగం
ఖమ్మంలో మోదీ ప్లెక్సీ వివాదం ఉద్రిక్తత
నేతల ప్రచారంపై విమర్శలు
ఖమ్మం, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి ):- స్వల్ప ఘటనలు మినహా ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4089 ఓటర్లు ఉండగా 3804 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కున్నారు.ఇందులో పురుష ఓటర్లు 2,214 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,590 మంది ఉన్నారు. దీంతో 93.03 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా వ్యాప్తంగా 24 పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 9మంది సెక్టార్ అధికారులు, 28 మంది ప్రిసైడింగ్ అధికారులు, 27 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, తదితర సిబ్బందిని వినియోగించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 విధించారు. కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తూ ఏర్పాటు చేశారు. పోలీసు కమీషనర్ సునీల్ దత్ స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు ఏసి పీలు, 16మంది సిఐలు, 26 మంది ఎస్ ఐ లు, 470 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు.
ఖమ్మం లో ఉద్రిక్తత.. తోపులాట
ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులు ప్రధాన భూమిక పోషించారు. ఆయా పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఖమ్మం రిక్కా బజార్ పోలింగ్ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు టెంట్లు వే సుకొని పోటీ పడి ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేశారు. బీజేపీ అనుబంధ టీచర్స్ యూనియన్ టెంట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో పాటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో యూటిఏఫ్ సంఘ నేతలు తీవ్ర అభ్యంతరం,ఆక్షేపణ తెలిపారు.
వెంటనే ప్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ, వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత కు దారి తీసింది.దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బిజెపి నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.అయినప్పటికీ వినిపించుకోకపోవడం తో బిజెపి పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని, స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా వారిని పార్టీ నేతలు అడ్డుకుని విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు బిజెపి నేతలను విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం పోలీసుల సూచనతో నరేంద్ర మోడీ ఫ్లెక్సీని, అభ్యర్థుల ఫోటోలను అక్కడినుంచి తొలగించడంతో పరిస్థితి శాంతించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేతల ప్రచారం
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి, కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అనుబంధ టీచర్స్ యూనియన్ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం గమనారం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఈ పరిస్థితి పల్ల స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి పార్టీ నేతలు సైతం పోలింగ్ కేంద్రం సమీపంలోని ప్రచార టెంట్ ల వద్దకు వచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పాటు నరేంద్రమోడీకి ఫోటోలు ఏర్పాటు చేయడం వల్ల వివాదానికి దారి తీసింది. జై శ్రీరామ్.. నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడం తో పాటు తోపులా టకు దారితీసింది.అనంతరం బీజేపీ నేతల అరెస్ట్, తర్వాత వదిలి వేయడం తో వివాదం సద్దుమణిగింది. నేతల ప్రచారం పై విమర్శలు వెళువేత్తాయి.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లావ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల ద్వారా 2022 మంది ఉపాధ్యాయులు ఓటింగ్ హక్కు వినియోగించుకోవలసి ఉండగా, 1859 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించు కొన్నారు. వారిలో పురుషులు 973, మహిళా ఉపాధ్యాయులు 886 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.జిల్లావ్యాప్తంగా 91.94% ఓటింగ్ నమోదయింది.
మొత్తం మీద జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం లక్ష్మీదేవి పల్లి మండలం లోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో బూత్ నెంబర్ 22లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఎస్పీ రోహిత్ రాజ్ పాల్వంచ పట్టణంలోని బొల్లోరు గూడెం ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన త్రాగునీరు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని ఎటువంటి పొరపాట్లుకుతావు లేకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా నల్గొండ రిసెప్షన్ సెంటర్ కు బ్యాలెట్ బాక్స్ లను తీసుకువెళ్లాలని సూచించారు.
ప్రశాంతంగా పోలింగ్
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 27 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం మండలంలో పోలింగ్ నిర్వహించారు.మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించు కున్నారు.నోడల్ అధికారి సాయినాథ్ ఎన్నికల నిర్వహకులకు సూచనలు సలహాలు ఇచ్చారు. మండలం మొత్తంలో ఉపాధ్యాయ ఓట్లు 34 ఉండగా 23 పురుషులు ఉండగా 11 మంది మహిళ ఉపాధ్యాయులు ఉన్నారు. 34 ఓటర్లలో మొత్తం 29 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల పరిశీలకులు తాహసిల్దార్ పి.వి రామకృష్ణ, ఎంపీడీవో ఎస్.కె. సిలార్ సాహెబ్ తెలిపారు.