చర్ల (విజయక్రాంతి): పి.ఎల్.జి.ఏ వారోత్సవాలు డిసెంబర్ 2 నుండి 8 వరకు ఘనంగా జరుపుకోవలని మావోయిస్టులు ఇచ్చిన పిలుపు సందర్బంగా ఛత్తీస్‌గడ్, ఒడిస్సా మహారాష్ట్రతో పాటు తెలంగాణ సరిహద్దు చర్ల మండలంలోని పలు మావోయిస్టు ప్రభావిత గ్రామలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిరోజుల క్రితం మావోయిస్టు బ్యానర్లు పూసుగుప్ప ప్రధాన రహదారిపై వెలసిన ఘటన మరువకముందే, మరికొన్ని సరిహద్దు రాష్ట్రాలలో వారోత్సవాలను నిర్వహించాలని పలు చోట్ల బ్యానర్లు దర్శనం ఇవ్వడం, మావోయిస్టు అగ్రనాయకుల నుంచి లేఖలు విడుదలవ్వడంతో పాటు, మంగళవారం చర్ల మండలం పుసుగుప్ప రహదారిపై చెట్లను నరికి రహదారికి అడ్డంగా వేశారనే సమాచారంతో పోలీసులు మరింత భద్రతని పెంచారు, దీనితో చర్ల పరిసర ప్రాంతంలో హై టెన్షన్ ఉన్నది.
ఐతే రోడ్డుపై పడి ఉన్న చెట్లు మావోయిస్టులు చేసారా? లేక గాలిదుమారంకు పడిపోయాయా అన్న విషయాన్ని పోలీసులు, అధికారులు వెల్లడించలేదు. ఈ వారోత్సవాల నేపధ్యంలో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయోనని ఆదివాసి గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. పి.ఎల్.జి.ఎ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా వారం రోజులు జరుపుకునే వారోత్సవాలు వల్ల తెలంగాణతో పాటు చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఏజెన్సీ సరిహద్దు గ్రామాలలో టెన్షన్ వాతవరణం ఏర్పాడింది. చర్ల మండల వ్యాప్తంగా పోలీసులు భారీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ఆరా తీస్తున్నారు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే పలు బస్సు వేళల్లో మార్పులు చేసింది.