మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఉవ్వెత్తున ఆందోళనకారుల నిరసన
ప్రజాప్రతినిధుల ఇండ్లకు నిప్పు
భద్రతా దళాల కాల్పుల్లో యువకుడు మృతి
వరుసగా రెండో రోజూ అమిత్‌షా సమీక్ష
ఇంఫాల్, నవంబర్ 18: మణిపూర్‌లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. మహిళలు, చిన్నారుల హత్యతో చెలరేగిన అల్లర్లు తీవ్రమవుతున్నాయి. మణిపూర్‌లో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో పాటు అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన తెగలైన కుకీ, మైతీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
రాష్ట్రంలో రెండువర్గాల ఆందోళనలు చేస్తున్నాయి. ఆదివారం రాత్రి బాబుపరా ప్రాంతంలో నిరసనకారులు పలు రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడి చేశారు. వాటికి తాళాలు వేశారు. ఆ పాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అతౌబా నింగ్ థౌజా (20) అనే యువకుడు మృతిచెందాడు. మరొకరు గాయపడ్డారు.
ఘర్షణలు ఎందుకంటే..
భద్రతా బలగాల బందోబస్తు కారణంగా కొంతకాలం స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల జిరిబామ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. కుకీ మిలిటెంట్లు ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 11 మంది కుకీలు మృత్యువాత పడ్డారు. తర్వాత మైతీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను మిలిటెం ట్లు అపహరించారు. తర్వాత ఆ ఆరుగురి మృతదేహాలు నదిలో లభ్యమ య్యాయి.
ఈ ఘటనలు రాష్ట్రాన్ని అట్టుడికేలా చేశాయి. హింస కారణంగా అక్కడి ప్రభుత్వం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆయా జిల్లాల్లో ప్రస్తుతం కర్ఫ్యూ విధించింది. దీంతో ప్రజారవాణా పూర్తిగా స్తంభించింది. వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. పోలీసులు ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతల ఇండ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు
జరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లో చొరబడిన ఆందోళనకారులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆయా కార్యాలయాలకు తాళం వేశారు. నైంతోకాంగ్‌లోని మంత్రి గోవిందాస్, లాంగ్ మైడాంగ్ బజార్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రాధేశ్యామ్, వాంజింగ్ తేంతాస్ బీజేపీ ఎమ్మెల్యే పానం బ్రోజెన్ ఇళ్లకు నిప్పుపెట్టారు. ఇంఫాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే రబీంద్రో పూర్వీకుల ఇంటికి నిప్పు పెట్టారు. ఆసమయంలో ఎమ్మెల్యే తండ్రి ఇంట్లోనే ఉన్నారు.
తాను ఆందోళనకారుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినా వారు వినకుండా ఇంటికి నిప్పు పెట్టారు. అంతకుముందు కూడా సీఎం బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంతో పాటు పలువురు మంత్రుల ఇళ్లపైనా దాడులు జరిగిన విషయం తెలిసిందే.
అమిత్ షా రెండో సమీక్ష
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం ప్రభుత్వ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు హాజరయ్యారు.
మణిపూర్‌లో శాంతిస్థాపనకు చర్యలు తీసుకోవాలని అమిత్‌షా అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి 50 కంపెనీల బలగాలను తీసుకొస్తామని ప్రకటించారు. హోంమంత్రిత్వశాఖ బృందం ఉద్రిక్తత ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు.
సీఎం అత్యవసర సమావేశం..
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం బీరేన్‌సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీఏ కూటమికి చెందిన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
మరోవైపు రాష్ట్రం లో శాంతిస్థాపన నెలకొల్పడంలో సీఎం బీరేన్‌సింగ్ విఫలమైనందుకు బీజేపీకి తమ మద్దతు ను ఉప సంహరించుకుంటున్నట్లు ఆదివారం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ప్రకటించింది. ఈ పార్టీకి మణిపూర్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. ఆ ఏడుగురి ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ కారణంగా బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు.