calender_icon.png 19 March, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగ్‌పూర్‌లో ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ

19-03-2025 12:27:29 AM

కొత్వాలి సహా 11 ప్రాంతాలకు వర్తింపు..

ప్లాన్ ప్రకారమే అల్లర్లు: సీఎం ఫడ్నవీస్..

మరో మణిపూర్‌లా మార్చేందుకు యత్నం..

ప్రభుత్వంపై ప్రతిపక్షాల మండిపాటు..

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ చేసిన ఆందోళన హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. సోమవారం అర్థరాత్రి నాగ్‌పూర్‌లోని హంసపురి ప్రాంతంలో చెలరేగిన అల్లర్లలో 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నాగ్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింఘాల్ సెక్షన్ 163 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం కింద ఉత్తర్వులు జారీ చేశారు. నాగ్‌పూర్ పరిధిలోని కొత్వాలి, గణేశ్ పేట్, తెహ్‌సిల్, లకడ్‌గంజ్, పచ్చావులి, శాంతినగర్, సక్కర్‌దర, నందన్‌వన్, ఇమామ్వాడ, యశోధర నగర్, కపిల నగర్‌లలో కర్ఫ్యూ విధించారు.

తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్థరాత్రి ఘర్షణలు జరిగాయి. కొందరు దుండగులు వాహనాలకు నిప్పంటించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. కాగా ఘర్షణలో దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారణమైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్లాన్ ప్రకారమే అల్లర్లు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

నాగ్‌పూర్ అల్లర్లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘నాగ్‌పూర్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్  నిరసన తెలిపారు. కానీ మతపరమైన గ్రంథాలను తగలబెట్టినట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తూ ఊరుకోం. పోలీసులపై దాడిని ఖండిస్తున్నాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘ఈ మధ్య వచ్చిన ‘ఛావా’ సినిమా కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలించి ఉండొచ్చు. సినిమాలో ఔరంగజేబు క్రూరత్వం చూసి తట్టుకోలేకపోయారు. ఇది ఆగ్రహాన్ని పెంచింది. ప్రజలు సంయమనం పాటించాలి’ అని పిలుపునిచ్చారు. మరోవైపు మతసామరస్యంతో ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రను మరో మణిపూర్‌లా మార్చాలని చూస్తున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.