షిల్లాంగ్ వర్సిటీ వీసీ బంగ్లాపై దాడి
షిల్లాంగ్, నవంబర్ 11: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ( ఎన్‌ఈహెచ్‌యూ)లో ఉద్రిక్తత నెలకొన్నది. అధికార దుర్వినియోగం, అసమర్థ అడ్మినిస్ట్రేషన్‌పై కొద్దిరోజులుగా వైస్ ఛాన్సలర్ ప్రభాశంకర్ శుక్లాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైస్ ఛాన్సలర్ తన పదవికి రాజీనామా చేయాలని కొద్దిరోజులుగా పలు విద్యార్థి సంఘాల నేతలు, వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. వర్సిటీ ఎదుట నిరవధిక దీక్షలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం విద్యార్థులు వైస్‌ఛాన్సలర్ బంగ్లా వద్దకు వెళ్లారు. ఇంటిబయట పార్క్ చేసిన కారుతో పాటు ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. అతికష్టం మీద వైస్ ఛాన్సలర్ అక్కడి నుంచి బయటపడి వెళ్లిపోయారు. దాడిలో ఆయనకు స్వల్పగాయాలైనట్లు తెలిసింది. విద్యార్థుల దాడిపై వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్టార్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.