- భౌతికదాడులపై రాష్ట్రప్రభుత్వం సీరియస్
- పోలీసుల అదుపులో 52 మంది గ్రామస్థులు
- ప్రధాన నిందితుడిగా బీఆర్‌ఎస్ నేత సురేశ్ అరెస్ట్?
- మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రమేయంపై అనుమానం
- ఫోన్ కాల్స్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ
- పోలీసుల పహారాలో గ్రామం.. బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు
వికారాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఫార్మా సిటీపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం నిర్వహించిన గ్రామసభ రణరంగమై భౌతికదాడులకు దారితీయడంపై రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సర్కార్ ఆదేశాల మేరకు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ రంగంలోకి దిగారు.
ఎస్పీ నారాయణరెడ్డి నేతృత్వంలో 250 మంది పోలీస్ సిబ్బంది లగచర్లతో పాటు సమీప గ్రామాలైన అక్కింపేట్, రోటిబండ తండా, పీసీ తండాలో మోహరించారు. ప్రధాన నిందితుడిగా బోగమోని సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. రాత్రికి రాత్రే 5౨ మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల మొబైల్స్ స్వాధీనం చేసుకుని, వాటిలోని వీడియోలు, కాల్స్‌తో పాటు సోషల్‌మీడియాలో వైరల్ అయిన వీడియోలు, మీడియాలో ప్రసారమైన వీడియో ఫుటేజీ ఆధారంగా అరెస్టున వారిలో లగచర్ల నుంచే కాకుండా హక్కింపేట్, సీపీ తండా, రోటిబండ తండాల్లోనూ కొందరు ఉన్నట్లు తెలిసింది.
వారిలో దాడులతో ప్రమేయం లేదని నిర్ధారించుకుని ౩౭ మందిని వదిలేసినట్లు తెలిసింది. మొత్తం ౧౫ మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడని నిర్ధారణకు వచ్చి బీఆర్‌ఎస్ నేత బోగమోని సురేశ్‌ను అదుపులోకి విచారిస్తున్నట్లు సమాచారం. సురేశ్ వెనుక ఎవరున్నా రనే విషయంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
మరోవైపు భౌతికదాడుల వెనుక బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఉన్నారనే చర్చ స్థానికంగా వినిపిస్తు న్నది. అరెస్టున వారిలో ఎక్కువ మంది బీఆర్‌ఎస్ నాయకులే ఉన్నట్లు సమాచారం. అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తల నేపథ్యంలో పోలీస్‌శాఖ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
స్కూళ్లు, కార్యాలయాలు బంద్..
పోలీసుల పికెటింగ్ కారణంగా మంగళవారం ఆయా గ్రామాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు తెరుచుకోలేదు. లగచర్ల పంచాయతీ కార్యాలయం సైతం మూసే ఉన్నది. గ్రామస్థుల దైనందిన కార్యకలాపాలు, రోజువారీ పనులకు బ్రేక్ పడింది. పోలీస్ బలగాలు కొత్తవారిని ఆయా గ్రామాల్లోకి అనుమతించలేదు. ఇప్పటికీ గ్రామాలపై పోలీస్ నిఘా కొనసాగు తున్నది. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో గ్రామస్తులు కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని ఊరి నుంచి బయటి గ్రామాలకు వెళ్లిపోయారు.
విచారణకు ఆదేశం..
ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. డీజీపీ జితేందర్‌కి పలు అంశాలపై కీలక సూచనలు ఇచ్చినట్లు సమాచారం. లగచర్లకు వెళ్లి విచారణ చేపట్టాలని ఏడీజీ మహేశ్ భగవత్‌ని ఆదేశించినట్లు తెలిసింది. విచారణ తర్వాత ఏడీజీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని సమాచారం.
నిలిచిన కులగణన..
పోలీస్ పికెటింగ్ నేపథ్యంలో లగచర్ల, హక్కింపేట్, సీపీ తండా, రోటిబండ తండా తదితర గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో ఎన్యూమరేటర్ల కులగణనకు బ్రేక్ పడింది. బుధవారం కూడా కుల గణన సర్వే జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది.
పోలీసుల అనుమానాలు ఇవీ..
ప్రజాభిప్రాయ సేకరణ శిబిరం వద్దకు బీఆర్‌ఎస్ నేత సురేశ్ వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు ఇతర అధికారులను లగచర్ల గ్రామానికి ఆహ్వానించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని సమాచారం. సురేశ్ ప్లాన్‌తోనే అధికారులను గ్రామానికి తీసుకెళ్లి, గ్రామస్తులను ఉసి గొల్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రధాన నిందితుడిగా సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొంతకాలం నుంచి సురేశ్ మెలుగుతున్నాడు. దీంతో పోలీసులు దృష్టి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిపైనా వెళ్లింది. సురేశ్ దాడులకు ముందు 42 సార్లు నరేందర్‌రెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని తెలిసింది. అలాగే నరేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆరుసార్లు ఫోన్లో సంభాషించినట్లు ప్రచారం జరుగుతున్నది.
మరోవైపు దాడులకు పాల్పడిన వారితో పాటు ఉసిగొల్పి పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిసింది. వారిని ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. పోలీసులు భౌతిక దాడుల అంశంపై అరెస్టులు, కొందరి కోసం గాలింపు చర్యలపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.