25-04-2025 01:46:40 AM
మావోయిస్టు నేత హిడ్మా, వేయిమంది నక్సల్స్ టార్గెట్‌గా..
జల్లెడపడుతున్న 20వేలమంది భద్రతా దళాలు
ఆపరేషన్ కర్రెగుట్ట
అష్టదిగ్బంధంలో దండకారణ్యం
రాయ్‌పూర్/చర్ల, ఏప్రిల్ 24: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టను భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాం తంలో గురువారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తుంది.
అయితే, ఘటనా స్థలంలో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. బీజాపూర్ పరిధిలోని కర్రెగుట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో పీఎల్‌జీఏ గ్రూపునకు చెందిన ముగ్గరు మహిళా మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు..
భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోబ్రా, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ దళాలు పాల్గొన్నట్టు ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. ఈ ప్రాం తంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.
చివరి అంకానికి..
మావోయిస్ట్ రహిత దేశమే లక్ష్యంగా ప్రారంభమైన ‘ఆపరేషన్ కగార్’ చివరి అంకానికి వచ్చినట్టు పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా, బెటాలియన్ చీఫ్ దేవాతోపాటు పెద్దమొత్తంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమా చారంతో ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధితోపాటు తెలంగాణలోని ములుగు జిల్లాలో విస్తరించి ఉన్న కర్రెగుట్టను ‘ఆపరేషన్ కర్రె గుట్ట’ పేరుతో భద్రతాదళాలు సోమవారం చుట్టుముట్టాయి.
అత్యంత అధునాతనమైన టెక్నాలజీ, హెలికాప్టర్, డ్రోన్లు, శాటిలైట్, బాంబుస్వాడ్, డాగ్‌స్కాడ్‌ల సహాయంతో దండకారణ్యాన్ని జల్లెడపడుతూ భద్రతా బలగాలు ముందుకుసాగుతున్నాయి. కర్రెగుట్టలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టలను అష్టదిగ్భందనం చేసినట్టు సమాచారం.
ఈ ఆపరేషన్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన భద్రతా దళాలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం నూగూరు మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నందున కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
కర్రెగుట్ట చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుపాతరలు అమర్చామని ఇప్పటికే మవోయిస్టులు లేఖల ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఈడీలను నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు వంద ఐఈడీ బాంబులను భద్రతా దళాలు వెలికి తీసినట్టు సమాచారం. ఈ క్రమంలో కర్రెగుట్ట పరిధిలోని గ్రామాల్లోకి ప్రజల రాకపోకలను అధికారులు నిలిపి వేసినట్టు తెలుస్తోంది.
తుపాకీ మోతలు, భద్రతా దళాల హడావిడితో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున బలగాలు మోహరించడం, దండకారణ్యంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ చివరి అంకానికి చేరినట్టుగా తెలుస్తోంది.
కాల్పుల విరమణ పాటించండి
కర్రెగుట్టలను భద్రతా బలగాలు ముట్టడించిన నేపథ్యంలో పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) స్పందించింది. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీడీసీ చైర్మన్ జస్టిస్ బీ చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హింస వల్ల ఒరిగేదేమీ లేదని, మావోయిస్టులు ఇప్పటికే మూడుసార్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినందున కాల్పులు విరమించాలని కోరారు.
దేశాన్ని మవోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యం
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు సంకల్పించుకుంది. దేశంలోని ఏ పౌరుడు కూడా మావోయిస్టు కారణంగా ప్రాణాలు కోల్పోకుండా ఉండటానికి మార్చి 31, 2026లోపు మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 150 మందికిపైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో 124 మంది మావోయిస్టులు బస్తర్ డివిజన్‌కు చెందినవారే. వారం రోజుల క్రితం జార్ఖండ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు కూడా ఉన్న విషయం తెలిసిందే.
చిక్కడు దొరకడు!
కర్రెగుట్టలో హిడ్మా ఉన్నాడా!
చర్ల, విజయక్రాంతి: మావోయిజా న్ని మట్టుబెట్టడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు కదులుతున్నా యి. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులను ముప్పుతిప్పలు పెడుతున్నా యి. మావోయిస్టులను అంతమొందించడమే టార్గెట్‌గా సాగుతున్న ఆపరేషన్ కగార్ కర్రెగుట్ట ఆపరేషన్‌తో ముగుస్తుందా..? దీనితో నక్సలి జం అంతమైనట్టేనా..? అంటే ఔననే పరిశీలకులు అంటున్నారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కోసం వేల సంఖ్యలో మోహరించిన భద్రతా బలగాలు భారీ ఎన్‌కౌంటర్‌కి సిద్ధమయ్యాయి. దీనితో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేకెత్తుతోంది. కర్రెగుట్టలో హిడ్మాతో సహా సుమారు మూడు వేల మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.
‘కర్రెగుట్ట చుట్టూ ఐఈడీ బాం బులు అమర్చాం, అటవీ ప్రాంతంలో అడుగడుగునా బూబి ట్రాప్ ఏర్పాటుచేసాం’ అంటూ మావోయిస్టులు లేఖ వదిలిన సమయం నుంచి అందరి దృష్టి కర్రెగుట్ట వైపే మళ్లింది. ఈ సమాచారంతో.. సవాలు గా తీసుకున్న భద్రతా బలగాలు అక్కడ భారీగా మోహరించి, అదునుచూసి కాల్పు లు జరిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నా యి.
కర్రెగుట్ట ప్రస్తావన తెచ్చి మావో యిస్టు లు చేజేతులా ముప్పును కొనితెచ్చుకున్నట్టయిందని పరిశీలకులు భావిస్తున్నా రు. దీనితో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పోలీస్ బలగాలు ఎక్కడికక్కడ బందోబస్తు చర్యలు తీసుకుంటూ, ఊళ్లల్లోకి వెళ్లేవారిని ప్రశ్నిస్తున్నారు.
మావోయిస్టులకు మరణశాసనమేనా?
కర్రెగుట్టలో ప్రస్తుతం భద్రతా బలగాల వ్యూహం నుంచి మావోయిస్టులకు తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. డేగ కళ్లతో, శాటిలైట్ ద్వారా అధునాతన టెక్నాలజీతో.. హెలికాప్టర్లతో, బాంబు స్క్వాడ్.. డాగ్ స్క్వాడ్‌లతో ముందుకు సాగుతున్న భద్రతా బలగాల వ్యూహం ఫలిస్తే మావోయిస్టుల పరిస్థితి ఏంటనేది మూడువేల మంది మావోయిస్టుల మరణ శాసనానికి ముహూ ర్తం ఖరారైనట్టేనా! చిక్కడు దొరకడు అంటూ వార్తలతో సంచలనాలను సృష్టించిన హి డ్మా మరేదైనా చక్ర వ్యూహం పన్ని..
భద్రత బలగాల కళ్ళు కప్పి ఎదిరించేందుకు ప్రణాళిక రచించారా? అనే ప్రశ్న అందరి మన సులలో ఊహాజనింది. హిడ్మా నిజంగానే కర్రెగుట్టలో ఉన్నాడా.. లేక భద్రత బలగాల దారి మళ్లించేందుకు కర్రెగుట్ట ప్రస్తావన తెరపైకి తెచ్చారా.. మరికొద్ది రోజుల్లో తేలనుంది.