కాంగ్రెస్ పాలనలో గాలిపటంలా రైతుల జీవితాలు.. మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు, సామాన్య ప్రజానీకం పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న(BRS District President Jogu Ramanna) అన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా బయలుదేరిన నేతలు, బస్ స్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. గాలి పటాలను చేతపట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రాలను దగ్ధం చేసేందుకు నేతలు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువురి మధ్య కొంత తోపులాట చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో అన్నదాతల పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.