calender_icon.png 19 October, 2024 | 7:52 PM

భద్రాచలంలో భయం.. భయం

28-07-2024 04:58:28 AM

  1. 53.08 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం 
  2. ముంపు ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్ 
  3. పునరావాస కేంద్రాలకు తరలిన ముంపువాసులు 
  4. పట్టణం నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు బంద్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరమ్మ మహోగ్రరూపం దాల్చింది. 9 భద్రాచలం వద్ద శనివారం రాత్రి గంటలకు 53.08 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భద్రాచలం నుంచి చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా కు రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే చర్ల, వెంకటాపురం, వాజేడు, కుక్కునూరు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపహాడ్ నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం భద్రాచలం నుంచి మణుగూరు వైపు మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. సారపాక నుంచి రెడ్డిపాలెం, బూర్గంపాడు నుంచి సోంపెల్లి మార్గాల్లో వరద చేరడంతో ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

ప్రవాహం 53.౦౮ అడుగులకు చేరగా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. యంత్రాం గం ఇప్పటికే ముంపు వాసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. భద్రాచలం డివిజన్‌వ్యాప్తంగా ముంపునకు గురైన 104 కుటుంబాలను  పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీకి చెందిన 46 కుటుం బాలు, ఏఎంసీ కాలేజీ ప్రాంతానికి చెందిన 48 కుటుంబాలు, బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన మూడు కుటుంబాలు, నాగినేనిప్రోలురెడ్డిపాలెంలో రెండు కుటుంబాలు, దుమ్ముగూడెం మండలం గంగోలు కు చెందిన ఐదు కుటుంబాలు చెందిన 20 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సాయంత్రం భద్రాచలంలో పర్యటించారు. గోదావరి కరకట్టను పరిశీలించారు. కొత్తగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికారులను సమీక్షించారు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి తావు ఉండొద్దని హెచ్చరించారు. పర్యటనలో కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు ఉన్నారు.

కడెంకు 8 వేల క్యూసెక్కుల వరద 

నిర్మల్ : వరుసగా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, శనివారం నీటిమట్టం 694 అడుగులకు చేరింది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌కు వరద పోటు తగిలింది. ఒక దశలో ప్రాజెక్ట్ తెగుతుందా.. అనే స్థాయిలో వరద పోటు తగిలింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టులోకి 8 వే కూసెక్యుల వరద చేరుతుంది. దీంతో ఇంజినీర్లు గేట్లను ఎత్తి అంతేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు.  

ఎస్సారెస్పీ@ 31.25 టీఎంసీలు

మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) ప్రాజెక్టుకి భారీ వరద వస్తున్నది. శనివార ఉదయం ప్రాజెక్టులోకి 27,850 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మధ్యాహ్నానికి 35,078కు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి 31.255 టీఎంసీలకు పెరిగింది. జున్‌లో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఆలస్యంగా ప్రారంభమైంది. జూలై రెండో వారంలో వర్షాలు మొదలు కావడంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన సింగింతం, కల్యాణి ప్రాజెక్టులు నిండటంతో వాటి వరద గోదావరి ఉప నది మంజీరాలోకి చేరుతోంది. అక్కడి నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే వరద పెరిగింది. 

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్ట్‌లకు వరద పోటు..

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణాకు వరద పోటు తగిలింది. కర్ణాటకలో అల్మట్టి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, కేవలం 77.05 టీఎంసీలు ఉంచి మిగిలిన నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువనకు వదిలేస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌లో తొలిసారిగా కృష్ణాకు 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి కూడా 1,58,457 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. శనివారం రాత్రి 10 గంటలకు 4.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.