27-03-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 26 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య వెలసిన శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి) పాలక మండలి ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. అమ్మవారికి నిత్యం సేవలు అందించే స్థానికులకు కాకుండా స్థానికేతరులకు పాలకమండలిలో అవకాశం కల్పించడం పట్ల కేశవాపురం జగన్నాధపురం గ్రామస్తులు మండిపడుతున్నారు.
బుధవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆ రెండు గ్రామాల ప్రజలు దేవాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రస్తుతం నియమించిన దేవాలయ పాలకమండలి రద్దు చేయాలని, పాలకమండలిలో స్థానికులకే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అజ్మీరా రమేష్ నాయక్, మరో యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి పాలకమండల రద్దు చేయాలంటూ నిరసన తెలిపారు.
లేనిపక్షంలో అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో దేవాలయం సమీపంలో కొంతసేపు ఉద్రుక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాలకమండలి ఏర్పాటుపై పలుమార్లు వివాదాలు తలెత్తాయి. గతంలో వేసిన పాలకమండలని రద్దుచేసి నూతనంగా మరో పాలక మండలి నియమించినప్పటికీ స్థానికులకు అవకాశం ఇవ్వలేదంటూ ఆగ్రహ జ్వాలలు వెలబడుతున్నాయి. దీంతో పాలకమండలి ప్రమాణస్వీకారం ప్రశ్నార్ధకంగా మారింది అని చెప్పవచ్చు. బుధవారం జరిగిన ఆందోళనతో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది.