హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ జడ్పీ పాఠశాల వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సోమవారం పాఠశాల గేటు విరిగిపడటంతో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. హయత్ నగర్ కార్పొరేటర్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనకు పాఠశాల ప్రిన్స్ పల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న రంగారెడ్డి డీఈవో సుశీందర్ రావు ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడుతున్నారు. గేటు విరిగిపడిన ఘటనలో మరో బాలుడికి స్వల్పగాయాలయ్యాయి.