calender_icon.png 24 September, 2024 | 10:48 AM

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

24-09-2024 03:07:27 AM

  1. ఆస్పత్రి సందర్శనకు వెళుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
  2. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్23(విజయక్రాంతి) : గాంధీ ఆస్పత్రి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో మాతా, శిశు మరణాలపై అధ్యయనం చేసేందుకు.. వైద్య, ఆరోగ్య సేవలు, సమస్యలను తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాలని ప్రయత్నించిన బీఆర్‌ఎస్ పార్టీ అధ్యయన కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రధాన ద్వారం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది.

గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, తదితరులను ఆస్పత్రి ఎదుట పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లకుండా అధ్యయన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీ రాజయ్యను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. జనగామ  ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు.

అయితే రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలు, సమస్యలపై అధ్యయనం కోసం బీఆర్‌ఎస్ పార్టీ తమ నేతలు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్, డాక్టర్ టీ రాజయ్యలతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గాంధీ ఆస్పత్రిలో మాతా, శిశు మరణాలపై అధ్యయనం చేసేందుకు, వైద్య, ఆరోగ్య సేవలు, సమస్యలను తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాలని ఆ కమిటీ సభ్యులు సోమవారం ప్రయత్నించారు. కాగా గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో 48మంది శిశువులు, 14మంది బాలింతలు చనిపోయారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుని తమకు తెలపాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సూచించారన్నారు. అయితే గాంధీ ఆస్పత్రిలోని సమస్యలను తెలుసుకునేందుకు వెళుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారో సీఎం రేవంత్‌రెడ్డి తెలపాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయట పడుతాయనే అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆరోపించారు. 

అరెస్టును ఖండించిన కేటీఆర్

గాంధీ ఆస్పత్రిలో వైద్య, ఆరోగ్య సేవలను అధ్యయనం చేసేందుకు వెళుతున్న త్రిసభ్య కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన నేతలను అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకుఏ ఇలాంటి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమండ్ చేశారు. రాజకీయాలకతీతంగా ఆస్పత్రులను పరిశీలిస్తామన్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించొద్దన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లోపాలను ఎత్తి చూపుతామని విమర్శించారు. 

గాంధీ ఆస్పత్రికి వెళ్తే తప్పేంటి?: టీ రాజయ్య

గాంధీ ఆస్పత్రికి తామె వెళ్తే తప్పేంటని, తెలంగాణలో ప్రజారోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా తయారైందని మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ ఆస్పత్రుల అధ్యయన కమిటీ చైర్మన్ టీ రాజయ్య పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ.రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్మయే మెతుకు ఆనంద్ మాట్లాడారు. కేసీఆర్ హయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్యారోగ్యంలో తెలంగాణ నంబర్ వన్‌గా మారిందని పేర్కొన్నారు.

మాతా శిశుమరణాలు, విష జ్వరాలు రాష్ర్టంలో పెరిగిపోతున్నాయని చెప్పారు. రాష్ర్టంలో పగలు ఈగలు, రాత్రి దోమలతో ప్రజలకు సహవాసం తప్పడం లేదన్నారు. దేని పైనా సమీక్ష లేకపోవడంతో ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గి పోయాయని, మందుల కొరత తీవ్రంగా ఉందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో హెలీకాఫ్టర్లలో ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సామగ్రి తరలించామని పేర్కొన్నారు. ఆ నాడు ప్రతిపక్షాలు చెబితే కేసీఆర్ ఆ పని చేయలేదని, స్వతహాగా చేశారని తెలిపారు.

గాంధీ ఆస్పత్రికి మేము వెళితే తప్పేమిటని, ఎందుకు పోలీసులు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలనా ?ఎమర్జెన్సీ పాలనా? అని మండిపడ్డారు. రేవంత్ పాలన గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు ఉందన్నారు. రేవంత్ పాలనలో మంత్రులు హెలికాప్టర్లను ఎడ్ల బండ్లలా తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు ముఖ్యమైనవి  విద్య, వైద్యమని, ఆ రెండింటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెట్టిస్తున్న ఘనత రేవంత్ ప్రభుత్వానిదన్నారు. గాంధీ ఆస్పత్రిని సీఎం ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో శిశు మరణాలు పెరిగాయన్నారు. ఎందుకు జరిగాయో తెలుసు కోవడానికి అక్కడికి వెళ్లామని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.