calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్

28-10-2024 02:27:54 AM

  1. పొంగులేటి వ్యాఖ్యలతో మాజీ మంత్రుల్లో భయం
  2. అరెస్టు చేస్తారని ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన 
  3. మరికొంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకే డ్రామా
  4. భయపడాల్సిన పనిలేదంటున్న గులాబీ పార్టీ పెద్దలు
  5. ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ఉద్యమం తరహాలో పోరు

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం పొలిటికల్ బాంబుల చుట్టూ తిరుగుతున్నాయి. ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్‌తో పాటు 17 అంశాల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులపై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేస్తోంది.

సరైన ఆధారాలతో నిందితులపై చర్యలకు రంగం సిద్ధమైంది. మంత్రి పొంగులేటి సియోల్ పర్యటన నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఎవరి అరెస్టు జరగబోతుందనే అన్న అంశం ఉత్కంఠంగా మారింది. నవంబర్ 1 నుంచి 8వరకు అందరినీ అరెస్టు చేస్తామని మంత్రి ప్రకటించారు.

దీంతో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌కుమార్‌తో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ మరికొంత మంది నేతల అరెస్టుకు రంగం సిద్ధమైందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తమ నాయకులను అరెస్టు చేస్తారనే ప్రచారంతో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

అదేవిధంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా రైతు సమావేశంలో అరెస్టుకు భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో పార్టీలో ఇది దేనికి సంకేతమని చర్చించుకుంటున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్నవరికి బోనస్ వంటి అంశాలపై తెలంగాణ ఉద్యమం తరహాల్లో పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెప్పారు. 

మరి కొంతమంది ఎమ్మెల్యేలను చేరుకునేందుకు ఎత్తుగడలు..

బీఆర్‌ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ చేర్చుకోవడానికే అరెస్టు చేస్తామని పొంగులేటి ఫోజులు కొడుతున్నారని గులాబీ సీనియర్లు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరగా, మరో 13 మందికి తమ పార్టీ జెండా కప్పి బీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసుకునేందుకు కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శిస్తున్నారు.

నెలరోజుల క్రితం హైకోర్టు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో దానిని నుంచి బయటపడేందుకు విలీనం ఒకటే మార్గమని, బ్లాక్‌మెయిల్ చేసి ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మూసీ లక్షన్నర కుంభకోణం, హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్ అలుపెరగని పోరు చేస్తూ బాధితుల పక్షాన నిలవడంతో కాంగ్రెస్ బలహీనపడుతుందనే అంచనాలతో మంత్రులు ఉన్నారని, గులాబీ నేతలను చేర్చుకుంటే ఆ పార్టీవైపు జనం చూడరని భావిస్తూ కాంగ్రెస్ మంత్రులు పూటకో వేశం వేస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్లు ఎద్దేవా చేశారు.