ఢాకాలో అవామీ లీగ్ నిరసనలు
వందలాది మందిని అరెస్టు చేసిన ప్రభుత్వం
ఢాకా, నవంబర్ 10: బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ కలకలం రేగింది. ప్రస్తుత బంగ్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ దేశ రాజధాని ఢాకాలో భారీ నిరసనకు దిగారు. అయితే ర్యాలీలు, నిరసనలకు అనుమతించేది లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘అవామీ లీగ్ ప్రస్తుత రూపంలో ఫాసిస్ట్ పార్టీ. ఈ ఫాసిస్టు పార్టీని బంగ్లాదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనకు అనుమతించబోమని’ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయినప్పటికీ అవామీలీగ్ మద్దతుదారులు నిరసన కార్యక్రమం చేపడతారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నగరంలో పెద్ద ఎత్తున్న పోలీసు బలగాలను మొహరించారు. అవామీ లీగ్ సమావేశాలు, నిరసనలను నిరోధంచడానికి ఢాకాలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బందోబస్తును ఏర్పాటు చేశారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుగా ఢాకా వీధుల్లో జమ అయిన అవామీలీగ్ కార్యకర్తలు యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బంగ్లా పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు.