calender_icon.png 21 October, 2024 | 4:00 AM

అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత

21-10-2024 01:38:13 AM

  1. గ్రూప్-1 పరీక్షలు వాయిదా కోరుతూ ప్రెస్‌మీట్‌కు యత్నం
  2. అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఆదివారం అశోక్‌నగర్ జంక్షన్ సమీపంలో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు గ్రూప్-1 అభ్యర్థులు ప్రయత్నించారు.

అప్పటికే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకొని అభ్యర్థులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రెస్‌మీట్ నిర్వహించి తమ బాధను ప్రభుత్వానికి చెప్పుకుందామంటే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే ఆకునూరి మురళి, కోదండరాం, బల్మూర్ వెంకట్, మహమ్మద్ రియాజ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

గాంధీ భవన్ ముట్టడికి యత్నం

గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. గాంధీ భవన్ వైపునకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.