calender_icon.png 1 November, 2024 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలు ఇస్తేనే టెండర్లు

11-08-2024 07:08:25 AM

  1. చేప పిల్లల సరఫరాకు ముందుకు రాని కాంట్రాక్టర్లు 
  2. ఇప్పటికే రెండుసార్లు టెండర్ కాల్ 
  3. వికారాబాద్ జిల్లాలో సుమారు రూ.70 లక్షల బకాయిలు 

వికారాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): మత్స్యకారులను ఆర్థికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా చెరువుల్లో, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదులుతోంది. దీంతో స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభిస్తోంది. అయితే, ఈ ఏడాది ఇప్పటి వరకు చెరువుల్లోకి చేప పిల్లలను విడుదల చేయలేదు. గతేడాది చేప పిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఇప్పటికీ చెల్లించకపోవడంతో వారు ముందుకు రావడం లేదు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 536 చెరువులు, 10 ప్రాజెక్టుకు సంబంధించి 105 మత్స్య సంఘాలు ఉన్నాయి. జిల్లాలో గతేడాది అన్ని రకాల సైజులతో కూడిన 1.40 కోట్ల చేప పిల్లలను కాంట్రాక్టర్లు సరఫరా చేశారు.

అందుకు వారికి సుమారు రూ.70 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. చేప పిల్లలను సరఫరా చేసి ఏడాది పూర్తయినా ప్రభుత్వం నుంచి డబ్బులు అందకపోవడంతో ఈ ఏడాది కాంట్రాక్టర్లు కనీసం టెండర్లు కూడా వేయలేదు. దీంతో సంబంధిత శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టు రెండో వారం నాటికే 90 శాతం చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేశారు. కానీ, ఈ ఏడాది ఇంకా టెండర్ల ప్రక్రియనే పూర్తికాకపోవడంతో ఈ పథకం అమలుపై మత్స్యకారుల్లో అనుమానం నెలకొంది.  

రెండుసార్లు పిలిచినా..

చెరువుల్లో చేప పిల్లల సరఫరాకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మత్స్యశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. జూలై 30న మొదటిసారి టెండర్ ప్రకటన ఇచ్చారు. అందులో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయలేదు. తిరిగి ఆగస్టు 2న మరోసారి టెండర్ పిలిచారు. రెండోసారి కూడా కాంట్రాక్టర్లు ఒక్క టెండర్ కూడా వేయలేదు. దీంతో సంబంధిత అధికారులు ఆరాతీయగా పాత బకాయిలు చెల్లిస్తే గాని టెండర్ వేయబోమని కాంట్రాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అయితే, మత్స్యశాఖ అధికారులు మరో ప్రయత్నంగా ఈ నెల 13న మరోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. మూడోసారైనా కాంట్రాక్టర్లు స్పందిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. 

గతంలో గిట్టుబాటు ధర లేక టెండర్లు వేయని కాంట్రాక్టర్లు.. 

చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని గత రెండు మూడేళ్లుగా కాంట్రాక్టర్లు వరుసగా టెండర్లు వేయలేదు. దీంతో అధికారులు స్వల్పంగా ధరలు పెంచి టెండర్లు వేసేలా చూశా రు. అయితే, ఈసారి గిట్టుబాట ధర విషయం కాకుండా గత బకాయిలు ఇవ్వాలని కాంట్రాక్టర్లు టెండర్లకు దూ రంగా ఉన్నారు. కాంట్రాక్టర్లు అందరూ ఓ సిండికేట్‌గా ఏర్పడి టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.