calender_icon.png 26 December, 2024 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సీతారామ’కు అనుమతి లేకుండా టెండర్లా!

04-11-2024 02:09:11 AM

  1. మీరెలా పనులకు టెండర్లు పిలిచారు
  2. మీపై ఏ కమిషన్‌తో విచారణ చేయించాలి: కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు అనుమతులు లేకుండా ఎలా టెండర్లు పిలుస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీరందిస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేశారు.

ఇప్పుడు మీపై ఏ కమిషన్‌తో విచారణ చేయించాలని విమర్శించారు. ‘అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లినోళ్లు, కాళేశ్వరం మీద కక్షగట్టి రైతుల పొట్ట గొట్టినోళ్లు, పాలుమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపినొళ్లు, ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్బాలు పలికేటోళ్లు, సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్ట్ డిస్టిబ్యూటరీల పనుల్లో నిబంధనలు ఎలా తుంగలో తొక్కారని విమర్శించారు.

మత్స్యకారుల జీవితాల్లో మట్టికొట్టిన సర్కార్

మత్స్యకారుల జీవితాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ మట్టికొట్టిందని మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడిపై ఇందిరమ్మ రాజ్యం కక్షగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మారితే పథకాలు పేర్లు మారతాయి కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. మూసీ పేరుతో పేదల ఇల్లు కూల్చి రాక్షస ఆనందం పొందుతున్నారని, హైడ్రా పేరుతో హైదరాబాద్ ఖ్యాతిని మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.