calender_icon.png 27 October, 2024 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనానికిటెండర్!

22-07-2024 01:29:59 AM

తెలంగాణలో వివిధ మౌలిక వసతుల పథకాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టెండర్ ప్రక్రియలో లోపాలతో ప్రభుత్వానికి ఏటా తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. నీటిపారుదల ప్రాజెక్టులు, పీడబ్ల్యూడీ, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో వివిధ పనుల కోసం రాష్ట్రప్రభుత్వం ఏటా దాదాపు రూ. 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తున్నది. అయితే, ఈ టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టెండర్లను కరెంట్ బేసిస్ ఆఫ్ షెడ్యూల్ రేట్ (సీఎస్‌ఆర్) ప్రకారం నిర్వహిస్తున్నారు. అంచనా వ్యయంలో కాంట్రాక్టు కంపెనీలు ఐదుశాతం లోపు టెండర్ వేసినా వాటికి ప్రభుత్వం పనులు అప్పగిస్తున్నది. 

ప్రభుత్వ టెండర్ల ప్రక్రియ అసంబద్ధంగా ఉంటున్నది. ప్రతి టెండర్‌లోనూ రెండు నుంచి నాలుగు సంస్థలు మాత్రమే పాల్గొంటున్నాయి. టెండర్లలో పాల్గొనేందుకు ప్రభుత్వం పెడుతున్న అర్హత నిబంధనలు అసంబద్ధంగా ఉండటమే అందుకు కారణం. ఈ నిబంధనలు కొన్ని ఏజెన్సీలకు మాత్రమే మేలు చేసేలా ఉంటున్నాయి. టెండర్లలో పాల్గొన్న ఈ కొన్ని సంస్థలు మైనస్ 2 నుంచి ప్లస్ నాలుగు శాతం మధ్య మాత్రమే కోట్ చేస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది. టెండర్ల ప్రక్రియ ఎలా ఉండాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ టెండర్ నిబంధనలను పరిశీలిస్తే మంచిది. ముఖ్యంగా జాతీయ రహదారుల సంస్థ నిర్వహించే టెండర్ విధానాన్ని పరిశీలించాలి. ఈ సంస్థ ప్రతి టెండర్‌లో కనీసం 6 నుంచి 10 సంస్థలు పాల్గొనేలా చూస్తుంది. అంతేకాదు.. కంపెనీల మధ్య పోటీ ఉండటంతో బిడ్లను కనీసం మైనస్ 10 నుంచి మైనస్ 20 శాతం కోట్ చేసేలా చూస్తుంది. 

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీఎస్‌ఆర్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పోల్చితే కనీసంగా 30 శాతం అధికంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ కంపెనీలు కూడా టెండర్లు దక్కించుకొని పనులు చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో తెలంగాణతో పోల్చితే 30 శాతం తక్కువ రేట్లకే బిడ్లు వేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుత సీఎస్‌ఆర్ విధానంతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతున్నది. గత పదేండ్లలో కనీసం రూ.లక్ష కోట్లు నష్టపోయింది. ఇందుకు టెండర్ల అర్హతల్లో కఠిన నిబంధనలూ కారణమే. అందువల్ల టెండర్ల ప్రక్రియలో, ముందస్తు అర్హతల నిర్ణయం విషయంలోనూ ప్రభుత్వం పునరాలోచించాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అమలు చేయాలి. దానివల్ల ప్రభుత్వానికి ప్రజాధనం ఆదా అవుతుంది.  

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి