calender_icon.png 10 January, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌలు రైతులకు న్యాయం కావాలి

16-07-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిలో ఒకటి ‘కౌలు రైతులకు న్యాయం చేయడం’. అసలు రైతులతోపాటు కౌలు రైతులకు, వ్యవ సాయ కూలీలకూ భరోసా కల్పిస్తామని పార్టీ నాయకులు అప్పట్లో హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు దాటుతున్నా రైతులకు రైతుబంధు (రైతు భరోసా) లేదు. హామీలు అమలు చేయడంలో ఇంకా జాప్యం జరుగుతున్నది. ఖరీఫ్ సీజన్ వచ్చినా కౌలు రైతుల ఊసు అసలుకే వినిపించడం లేదు.

రాష్ట్రంలో కౌలు రైతులు అధికంగా ఉంటారు. దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు కౌలుదారుడే అని అంచనా. గతంలో ‘ఎన్‌ఎస్‌ఎస్‌ఓ’ (నేషనల్ సాం పుల్ సర్వే ఆఫీస్) 17.5 శాతం మేర కౌలు రైతులు ఉంటారని అంచనా వేసింది. వీళ్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిఫలాలూ అందవు. ‘రైతు స్వరాజ్య వేదిక’ అధ్యయనం ప్రకారం 36 శాతం మేర కౌలు రైతులు ఉన్నట్లు తెలుస్తున్నది. అంటే, సుమారు 22 లక్షల వరకు వున్నట్టు లెక్క. ఇది ‘ఎన్‌ఎస్‌ఎస్‌ఓ’ అంచనాను దాటేసింది. కౌలు రైతులకు ఉన్న భూములు కూడా చాలా తక్కువ. పెద్ద మొత్తంలో భూమి ఉన్న రైతులు కొంత భూమిని కౌలు కు ఇవ్వడం చూస్తున్నాం.

కౌలు సాగుకు అయ్యే ఖర్చుకూడా భారీగానే ఉం టున్నది. కౌలు రైతులు ముందస్తుగానే అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తారు. వీళ్లు అప్పులు చేస్తూ, ఆధారపడేది ఎక్కువగా ఎరువుల దుకాణదారులు, డీలర్ల దగ్గరే. గత ప్రభుత్వం కూడా భూమి పట్టా విషయంలో, అదే విధంగా రైతు పట్టాకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతో పట్టాదారునికే అనుకూలంగా ‘ధరణి’ని తీసుకు వచ్చింది. ‘కౌలుదారు’ అనే కాలమ్‌నే తొల గించింది. రైతుబంధు, రైతుబీమాతోసహా పీఎం కిసాన్ సెంటర్ డబ్బులు, పంట నష్ట పరిహారం వంటివన్నీ వ్యవసాయం చేయని రైతు (పట్టాదారు)కు లభించాయి. ఒక రకంగా కౌలు రైతులను నట్టేట ముంచాయి. నేటి ప్రభుత్వమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు న్యాయం చేయా లని ప్రజలు కోరుతున్నారు.

కౌలు రైతులను గుర్తించే యోచనలో చాలా అపోహలు ఉన్నాయి. కౌలుదారుని గుర్తించాలంటే పట్టాదారు అయిన రైతుకూడా ఒప్పుకునే అవకాశం కావాలి. కౌలు రైతులకు లాండ్ లార్డ్ నుండి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఒక సానుకూల విధానం తీసుకురావాలి. ‘ధరణి’లో కూడా కౌలుదారు కాలం పెట్టాలి. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ అధికారులు సైతం పంట వివరాలు తీసుకొని, సేద్యం చేసేవారికి సబ్సిడీలు, విత్తనాలు వంటివి అందించే ఏర్పాట్లు చేయాలి. ‘లాండ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం 2011’ ప్రకారం ‘ఎవరైతే కౌలు చేస్తారో వారికి కౌలుదారు కార్డ్‌లు జారీ చేయాలి’. దాని ప్రకారం నిజమైన రైతులకు ప్రభుత్వ ఆర్థిక, తదితర సహాయాలు పొందే అవకాశం ఉంటుంది. 

 కిరణ్ ఫిషర్