2011 చట్టాన్ని అమలు చేయాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
కౌలు రైతుల గుర్తింపు-రైతు భరోసాపై మీటింగ్
ముషీరాబాద్, జూలై 5: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులతో పాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రైతు, ప్రజా సంఘాలు డ్రిమాండ్ చేశాయి. దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులు ఆశలు పెట్టుకున్నారని తెలిపాయి. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘కౌలు రైతుల గుర్తింపు భరోసా’ అనే అంశంపై విస్సా కిరణ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి కౌలు రైతులు పాల్గొని తమ సమస్యలు, డిమాండ్లను వినిపించారు.
సమావేశానికి రైతు స్వరాజ్య వేదిక నేతలు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్, బీ కొండల్, సంగెం బొర్రన్న, చైతన్య, శ్రీహర్ష, నాగార్జున, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీబీఎఫ్ నాయకులు పి.శంకర్, పులి కల్పన, తెలంగాణ రైతాంగ సమితి నాయకులు జక్కుల వెంకటయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మండల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు వీ సంధ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తూ, కౌలు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని వారికి ఎల్‌ఈసీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
రైతు భరోసా సహాయాన్ని కౌలు రైతులకు అందించాలని కోరారు. గుర్తింపు పొందిన కౌలు రైతులకు పంట బీమా, పంట నష్ట పరిహారం, రైతుబీమా, పంట అమ్మకం, బ్యాంక్ రుణాలు వంటి సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, నాయకుడు నల్లమల వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కౌలు రైతులకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నదని తెలిపారు. అభిప్రాయ సేకరణ చేసి కౌలు రైతులు, రైతు సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.