calender_icon.png 20 January, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో విషాదం నింపుతున్న రైతుల ఆత్మహత్య ఘటనలు

19-01-2025 10:16:53 PM

చికిత్స పొందుతూ కౌలు రైతు మృతి

రిమ్స్ వద్ద అఖిలపక్షం నేతల నిరసన

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్య(Farmer Suicide) ఘటనలు విషాదాన్ని నింపుతున్నాయి. పంట సాగు కోసం చేసిన అప్పులను తీర్చలేక అన్నదాతలు తనువు చాలించడంతో రైతుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంటుంది. ఇప్పటికే బేల మండలంలో రాథోడ్ దేవ్ రావు అనే రైతు నిన్న ఐసీఐసీఐ బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే, తాజాగా ఆత్మహత్యయత్నం చేసి చికిత్స పొందుతూ కౌలు రైతు మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఉట్నూర్ మండలం లింగోజీ తండా, సేవదాస్ నగర్ కు చెందిన కౌలు రైతు రాథోడ్ గోకుల్ (40) చేసిన అప్పులు తీర్చలేక ఈనెల 12న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఐతే రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

రైతు చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna)తో పాటు రైతు సంఘం నేతలు హుటాహుటిన రిమ్స్ కు చేరుకొని రైతు మృతదేహాన్ని సందరించారు. మృతుని కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, తమ తీవ్ర ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రిమ్స్ మార్చురీ ఎదుట రైతు సంఘం నాయకులు ఆందోళన దిగడంతో టూ టౌన్ సిఐ కమలాకర్ వారిని సముదాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న రైతుల ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుతం చేసిన హత్యలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత హయాములో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు. ప్రభుతం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి, ఇజ్జగిరి నారాయణ, గంగాధర్, యునుస్ అక్బనీ, తదితరులు పాల్గొన్నారు.