పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు.. అంతకంటే 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది
అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
సంగారెడ్డి (విజయక్రాంతి): సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణలో పరిపాలన చేసి నీళ్లు నియమకాల పేరిట దోపిడీ చేశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణను ఇస్తే కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో దోపిడీ చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సైతం ఉండరని ఆ పార్టీలో ఉండేది కేసీఆర్ కేటీఆర్ కవిత మాత్రమే అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఎవరు కూడా నిరాశ పడరాదన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. 11 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 54 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు.10 సంవత్సరాల పాలించిన టిఆర్ఎస్ పార్టీ 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నియమకాలు చేస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, గిరిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం మధు గాలి అనిల్ కుమార్ ఉజ్వల్ రెడ్డి తదితరులు ఉన్నారు.