calender_icon.png 23 October, 2024 | 3:23 AM

ప్రతి నెలా అదనంగా.. పదివేల కోట్లు కావాలి

23-10-2024 02:10:43 AM

ఆదాయానికి, ఖర్చుకు భారీ వ్యత్యాసం

  1. ధరలు పెంచాల్సిన అనివార్య స్థితిలో ప్రభుత్వం
  2. పెంచితే మొదటి ఎఫెక్ట్ ఎక్సైజ్ శాఖ పైనే..
  3. ప్రభుత్వ యత్నాలు బడ్జెట్ లక్ష్యాలను అందుకుంటాయా?

హైదరాబాద్, అక్టోబర్ 2౨(విజయక్రాంతి): రాష్ట్ర ఖజానా తీవ్ర ఒడిదొడుకు లకు లోనవుతోంది. ప్రభుత్వం నెలవారీగా పెట్టే ఖర్చులకు, వచ్చే రాబడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవైపు సర్కారు తెచ్చిన అప్పుల కంటే, కట్టే వడ్డీలు ఎక్కువగా ఉండటం.. మరోవైపు నెల వారీగా ఖర్చులు పెరిగిపోతుడం.. వెరసి రాబడిని పెంచుకోవడంపై సర్కారు ఫోకస్ పెట్టింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆదాయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సంక్షే మ పథకాలను అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, సన్న వడ్లకు బోనస్ లాంటి పథకాలను తీసుకురాబోతోంది. దీనికితోడు ప్రస్తుతం అమ లవుతున్న స్కీమ్స్‌కు లబ్ధిదారులు పెరిగిపోతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో నెలకు అదనంగా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తే తప్పితే ఖజానా గట్టెక్కే పరిస్థితి కనపడట్లేదు. ఈ స్థాయిలో తక్షణం రాబడి పెరగడానికి కొన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అందు లో భాగంగా ఎక్సైజ్, మైనింగ్, జీఎస్టీ వంటి ఆదాయం తెచ్చే శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రూ.3 వేల కోట్ల తేడా

కాగ్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి రెవెన్యూ రాబడులు రూ.61,618.60 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో సర్కారు రూ.77140.22 కోట్లను ఖర్చు చేసింది. ఆదాయానికి, ఖర్చుకు రూ.15,521.62 కోట్ల వ్యత్యాసం ఉంది. అంటే సగటున నెలకు రూ.3 వేల కోట్ల లోటు కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ప్రభుత్వం రూ.10,497.52 కోట్లు వడ్డీల రూపంలో కట్టింది.

ప్రతి నెల వడ్డీలతో తీసుకున్న అప్పునకు ప్రభుత్వం ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కడుతుంది. వడ్డీలకు ప్రిన్సిపల్ అమౌంట్‌ను కలిపితే.. దాదాపు ఆ మొత్తం రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు చేరుతుంది. అంటే నెలకు సగటున వడ్డీలు, ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి సర్కారు దాదాపు రూ.4 వేల కోట్లను చెల్లిస్తుంది. దీనికి తోడు ఇప్పటికే తీసుకున్న అప్పులు అలా ఉంచితే..

ఖర్చుకు తగ్గట్టు రాబడి లేకపోవడంతో అవసరాల నిమిత్తం ప్రభుత్వం కొత్త రుణాలను తీసుకోవాల్సి వస్తోంది. దీంతో నెలనెలా వడ్డీల భారం మరింత పెరుగుతున్న స్థితి. అటు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుండటంతో భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. గృహజ్యోతి పథకం లబ్ధిదారులు మొదట్లో 46.19 లక్షల కుటుంబాలు ఉంటే..

అక్టోబర్ నాటికి 50 లక్షల కుటుంబాలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో గతంలో కంటే మహిళా ప్రయాణికులు భారీగా పెరిగారు. అక్టోబర్ 1 నుంచి 16 వరకు దాదాపు 42.34 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. సాధారణ రోజుల్లో ఇంతమంది ప్రయాణించరు.

మిగతా పథకాల్లో కూడా ఇలా లబ్ధిదారులు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వరద బాధితులకు నష్ట పరిహారం, రుణమాఫీ ఇలాంటి ప్రభుత్వం తక్షణం పూర్తి చేయాల్సిన పథకాలు కొన్ని ఉన్నాయి. ఇవన్ని అమలు చేయాలంటే.. ప్రభుత్వానికి ఇప్పుడొచ్చే ఆదాయం కంటే ప్రతి నెల అదనంగా రూ.10 వేల కోట్ల రాబడి వస్తేనే గట్టెక్కే పరిస్థితి కనపడుతోంది.

మొదటి ఎఫెక్ట్ ఎక్సైజ్ పైనే..

ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రావాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ఇటీవల ఆదాయం తెచ్చే శాఖలపై రివ్యూ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ధరలు పెంచకుండా ఆదాయం ఎలా పెంచుకోవచ్చో ప్రతిపాదలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అయితే, ధరలు పెంచకుండా ప్రభుత్వం ఆశించిన రాబడి రాదనే విషయాన్ని కొన్ని శాఖల అధికారులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ ధరలను పెంచాల్సి వస్తే.. మొదటి ఎఫెక్ట్ ఎక్సైజ్ శాఖపైనే పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ధరలు పెంచితే తప్పితే రాబడి పెరగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నివేదికను ఇచ్చినట్లు సమాచారం. మద్యం ధరల పెంపు అంశంపై సోమవారం ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ప్రస్తావించినట్టు సమాచారం.

ఒకవేళ పెంచాల్సి వస్తే దేశీయ బ్రాండ్లకు గరిష్ఠంగా రూ.20 వరకు, విదేశీ బ్రాండ్లకు రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు సమచారం. చివరిసారిగా డిసెంబర్ 2022లో మద్యం ధరలను పెంచింది. రెండేళ్లకోసారి ప్రభుత్వానికి మద్యం ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన ఇప్పుడు కాకపోయినా డిసెంబర్‌లో అయినా ధరలు పెంచక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రాజీవ్ స్వగృహ ఇళ్ల అమ్మకం ద్వారా..

రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మడం ద్వారా కూడా ప్రభుత్వ తక్షణ ఆదాయం పొందాలని చూస్తోంది. ఈ అంశం ఇటీవల సీఎంతో జరిగిన సమీక్షలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. వీటిని అమ్మడం ద్వారా రూ.3 వేల కోట్లను ఆర్జించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఇళ్ల ధరలపై రూపొందించిన నివేదికను కూడా అధికారులు ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తోంది.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ఇసుక రీచ్‌లు, ఇసుక ధరలను సవరించడం వంటి అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే, జీఎస్టీలో లీకేజీలను అరికట్టడంపై ఆ శాఖ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వసూళ్లను రాబట్టేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తోంది. ఎగవేతలపై కూడా ప్రత్యేక దృట్టి పెట్టింది.

గతంలో ప్రభుత్వం ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు కొందరికి భూములను ఇచ్చింది. అయితే, కొందరు వ్యాపార కార్యకాలాపాలను ప్రారంభించలేదని గుర్తించింది. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకొని, వేలం ద్వారా విక్రయించాలని చూ స్తోంది. ఇలా ఆదాయం తెచ్చే అన్ని శాఖల నుంచి లక్ష్యానికి అనుగుణంగా రాబడులను పెంచుకునేందుకు అధికారులను సమాయత్తం చేస్తోంది.

బడ్జెట్ లక్ష్యాలకు అనుగు ణంగా వందశాతం రాబడులను పొందేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్టు ధరలు పెంచకుండా బడ్జెట్ లక్ష్యాలను సాధిస్తుందా? అనివార్య పరిస్థితిలో ధరలను పెంచుతుందా? అనేది వేచి చూడాలి.