- సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఖమ్మం వరద బాధితుల అసంతృప్తి
- రోడ్లమీదకు వచ్చి నిల్చుంటే మాట్లాడకుండా వెళ్తారా?
- ఇంత మాత్రం దానికి ఎందుకు వచ్చారు?
- ప్రభుత నిర్లక్ష్యం వల్లనే సర్వం కోల్పోయాం
- అధికారులు పత్తా లేరు.. సీఎం వస్తుంటే మాత్రం వచ్చారు
- ఖమ్మం పర్యటనలో అడుగడుగునా సీఎంకు నిరసన సెగ
ఖమ్మం, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వరద బాధితుల నిరసన హోరు మధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన కొనసాగింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఖమ్మం నగరానికి చేరుకున్న సీఎం నగర శివారులో పేదలు నివసిస్తున్న కరుణగిరి ఏరియా లోని రాజీవ్ గృహకల్ప సముదాయం వద్దకు చేరుకున్నారు. సీఎం బాధితుల గోడు వింటారని తొలుత అంతా భావించారు. కానీ, ఆయన కేవలం తూతూ మంత్రంగా వచ్చి, కేవలం ఒక ఇంటిలోకి వెళ్లి వరద గురించి ఇంట్లోని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం కలిగించే రీతిలో ఎటువంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంతేకాకుండా సీఎం వస్తున్నారని, తమ గోడు విని, న్యాయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన బాధిత ప్రజలకు చివరికి నిరాశే ఎదురైంది. సీఎంకు తమ గోడు వెళ్లబోసుకుందామని రోడ్ల వెంబడి పెద్ద సంఖ్యలో మహిళలు, వరద బాధితులు వర్షంలో నిలబడి ఎదురుచూశారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి వారిని పట్టించుకోకుండానే వెళ్లిపోవడంతో వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. పైగా అక్కడే సీఎం మాట్లాడుతున్నా.. ఆయన మాటలను పట్టించుకోలేదు. ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇస్తానమని సీఎం ప్రకటించగానే.. వరద బాధితులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలితే రూ.10 వేలు ప్రకటిస్తారా? వాటితో ఏమి చేసుకోమంటారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమాత్రం దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకంటూ నిరసన తెలిపారు. నగదు, వస్తువులు, క్వింటాళ్ల కొద్ది బియ్యం, ధాన్యం, బంగారం, సర్వం కోల్పోయామని.. ఇంత తక్కువ పరిహారం ప్రకటిస్తారా? అంటూ మహిళలు సీఎం ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి త్వరగా ప్రసంగం ముగించుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. జనాల్లోంచి నిరసన వ్యక్తం కావడంతో అక్కడే ఉంచిన నిత్యావసర వస్తువుల బ్యాగులను కూడా పంపిణీ చేయకుండానే వెళ్ళిపోయారు.
తమ బాధ చెప్పుకుందామని వర్షంలో రోడ్లమీదకు వచ్చి నిలబడితే ఏమి వినకుండా వెళ్ళిపోతారా? అంటూ బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏమాత్రం సరిపోదని మహిళలు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగాని తనం వల్లనే తాము ఇంత నష్టపోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా కనీసం వరదల గురించి, ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వల్లనే తాము కట్టుబట్టలతో మిగిలామని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ రోజు ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి తమ ఇళ్లకు వచ్చిన పాపానా పోలేదన్నారు. ఎలా ఉన్నారు..? తిన్నారా లేదా? పిల్లలతో ఎటువంటి అవస్థలు పడుతున్నారో కనీసం వచ్చి పలుకరించని వారు లేరని ఆగ్రహం మండిపడ్డారు. పస్తులతో పిల్లలతో అలమటిస్తున్నామని వాపోయారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుని, తమను నట్టేటా వదిలిపోతారా అంటూ సీఎంను నిలదీశారు.
న్యాయం చేయకుంటే వదలేదీ లేదు
వరదల కారణంగా తీవ్ర తమకు న్యాయం జరగకపోతే సహించేది లేదని బాధితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. పేదలు ఎక్కువగా ఉండే బొక్కలగడ్డ ఏరియాలో కూడా సీఎంకు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. రేవంత్‌రెడ్డి ప్రకటించిన సాయం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తన నష్టం జరిగితే అధికారులు, మంత్రులు ఎటుపోయారని ప్రశ్నించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఇలానా న్యాయం చేయడమని నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నాయి..రక్షించండి మహాప్రభో అన్నా ఏ ఒక్క అధికారి స్పందించ లేదని.. ఇప్పుడు సీఎం వస్తున్నారంటే మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హెలీకాప్టర్ అన్నారు.. ఎక్కడ? అని ప్రశ్నించారు.ఎవరో మహానుభావుడు ధైర్యం చేసి, వచ్చి కాపాడే దాకా తమకు దిక్కులేకుండా పోయిందని, లేకుంటే తొమ్మిది మంది ప్రాణాలు నీటిలో కలిసిపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం కాల్వఒడ్డు వద్ద కూడా బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో ఉద్రికత్తకు దారి తీసింది. సీఎం పర్యటనలో అడుగడున నిరసనజ్వాలాలే కనిపించాయి.
చీకటిలోనే ఖమ్మం నగరవాసులు
పునరావాస కేంద్రాల్లోనూ అంధకారమే
ఖమ్మం(విజయక్రాంతి): వరదలతో సర్వం కోల్పోయిన ప్రజలకు కరెంట్ కష్టా లు తప్పడం లేదు. గత రెండు రోజలుగా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నాయుడుపేట, జలగం నగ ర్, ఆర్టీసీ కాలనీ, పెద్ద తండ, కరుణగిరి, రా జీవ్‌గృహ కల్ప, బొక్కలగడ్డ మోతీనగర్ కాలనీలన్నీ అంధకా రంలో మగ్గుతున్నాయి. పునరావాస కేంద్రాల్లోనూ కరెంట్ లేక ఇబ్బందిపడుతున్నారు.
ఇళ్లల్లో ఉండలేని దుస్థితి
వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్ల ల్లో ఉండలేని దుస్థితి నెలకొన్నది. ఇళ్లలో సామానులు చెల్లాచెదురుగా పడిపోవడంతో పాటు కొన్ని నీటి ఉధృతికి కొట్టుకు పోయాయి. ఇళ్లల్లో ఇసుక మేట వేసింది. గోడలన్నీ తడిచి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇళ్లల్లోకి పాములు, తేళ్లు, విష పురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. వండుకుని తిందామంటే కనీసం బియ్యం, ఉప్పు, పప్పు లేదని వాపోతున్నారు.
ప్రభుత్వ వైఫల్యమే..: పువ్వాడ
ఐఎండీ హెచ్చరించినా వరదలను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడంతోనే ప్రజలు సర్వం కో ల్పోయారని మాజీ మంత్రి పువ్వాడ అజ య్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తే నష్టం జరిగేది కాదన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదన్నారు. వరదలు తగ్గుముఖం పట్టినా బాధితుల అవస్థలు తీరడంలేదన్నారు.
కరెంట్ లేక, తిండి లేక ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు పెట్టాలన్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల న్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబా లకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వా లని కోరారు. తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేయాలన్నారు. రాజ్యసభ స భ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ చాతగాని తనం వల్లనే ఖమ్మం ప్రజలకు కష్టాలు వచ్చాయన్నారు.