బీసీసీఐ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు కఠినమైన నిబంధనలు విధిస్తూ పది పాయింట్ల పాలసీని తీసుకురానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఎదుట పది పాయింట్లతో కూడిన పాలసీని ప్రవేశపెట్టనుంది.
* జాతీయ జట్టుకు ఆడాలనుకునే ప్రతీ క్రికెటర్ ఇకపై దేశవాలీలో ఆడాల్సిందే. కుర్రాళ్లతో పాటు సీనియర్లకు ఈ నిబంధన వర్తించనుంది. సరైన కారణం చూ పిస్తేనే మినహాయింపు లభించనుంది.
* స్వదేశంలో లేక విదేశంలో సిరీస్ కావొచ్చు.. ఇకపై ఏ ఆటగాడైనా వ్యక్తిగతంగా కాకుండా జట్టుతో పాటే ప్రయాణించాల్సి ఉంటుంది.
* విదేశాల్లో జరిగే సిరీస్‌లు 45 రోజులకు మించి ఉంటే క్రికెటర్ల కుటుంబాలకు ఇక నుంచి రెండు వారాల సమయం మాత్రమే ఇవ్వనుంది.
* బీసీసీఐ నిర్వహించే మీటింగ్‌లు, కార్యక్రమాలకు ఆటగాళ్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
* ఇక నుంచి జట్టులో ఏ ఆటగాడైనా బోర్డు అనుమతి లేకుండా వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్లడం కుదరదు. వాళ్లను తీసుకెళ్లాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి.
* ప్రాక్టీస్ చేసేందుకు ఇకపై జట్టులోని ఆటగాళ్లంతా ఒకే బస్సులో రావాలి.
* ఏదైనా సిరీస్ ముగియగానే కొందరు ఆటగాళ్లు వ్యక్తిగతంగా వెళ్లిపోతున్నారు. ఇక నుంచి అలా కుదరదు. సిరీస్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా ఒకే బస్సులో ప్రయాణించాలి.
* గతంలో ఎంత లగేజీ వెంట తీసుకెళ్లినా బీసీసీఐ మొత్తం చెల్లించేది. ఇక నుంచి 150 కేజీల వరకు మాత్రమే అనుమతి. అది దాటితే ఆ ఖర్చు ప్లేయర్లదే.
* సిరీస్ పర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్‌లకు అనుమతి లేదు.
* ఇప్పటివరకు స్టార్ క్రికెటర్లకు వ్యక్తిగత రూమ్‌లు ఇచ్చేవారు. ఇకపై సహచర ఆటగాళ్లతో కలిసి రూమ్‌ను పంచుకోవాల్సి ఉంటుంది.