calender_icon.png 8 October, 2024 | 5:18 PM

9 రోజుల్లో రూ.10 లక్షల కోట్లు

31-08-2024 12:45:59 AM

  1. నాన్‌స్టాప్ ర్యాలీతో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
  2. సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ సూచీలు 
  3. సెన్సెక్స్ మరో 230 పాయింట్లు అప్

ముంబై, ఆగస్టు 30: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడంతో శుక్రవారం సైతం భారత స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగింది. ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో గ్యాప్‌అప్‌తో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా అదే ట్రెండ్‌ను కనపర్చాయి. ఇంట్రాడేలో 502 పాయింట్లు పెరిగి బీఎస్‌ఈ సెన్సెక్స్ 82,637 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని నమోదు చేసింది.

చివరకు  231 పాయింటు జతచేసి 82,365 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ ముగింపు సైతం కొత్త రికార్డే. అలాగే ఈ సూచీ పెరగడం వరుసగా ఇది తొమ్మిదో రోజు. ఈ 9 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,941 పాయింట్లు ర్యాలీ చేసింది. తొమ్మిది రోజుల ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్ల మేర పెరిగింది.  బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.10,00,028 కోట్లు పెరిగి రూ.4,64,39,994 కోట్లకు (5.54 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 

నిఫ్టీ అరుదైన రికార్డు

వరుసగా 12వ రోజూ ర్యాలీ జరిపి నిఫ్టీ అరుదైన రికార్డును నెలకొల్పింది. 1996లో నిఫ్టీ సూచి మొదలైన తర్వాత నాన్ ఇన్ని రోజులు పెరగడం ఇదే ప్రధమం. తాజాగా ఈ సూచి ఇంట్రాడేలో 116 పాయింట్లు జంప్‌చేసి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి 25,268  పాయింట్ల వద్ద నూతన గరిష్ఠాన్ని తాకింది. తుదకు 84 పాయింట్లు లాభపడి  25,236 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం కూడా ఇదే ప్రధమం. 12 ట్రేడింగ్ రోజుల వరుస ర్యాలీలో నిఫ్టీ 1,096 పాయింట్లు ఎగిసింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,279 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 412 పాయింట్లు లాభపడింది.

సానుకూల గ్లోబల్ సంకేతాలు

సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న భరోసా ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నెలకొందని దీంతో యూఎస్, భారత్ సూచీలు రికార్డుస్థాయిల వద్ద కొనసాగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 1996లో నిఫ్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూలేని స్థాయిలో ఉత్తమ ర్యాలీ జరిపిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. ధనిక దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలతో కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉన్నందున టెక్నాలజీ కంపెనీల భవిష్యత్ అవకాశాల పట్ల మార్కెట్లు ఆశావహంగా ఉన్నాయని, ఫలితంగా శుక్రవారం గ్లోబల్ షేర్లు ర్యాలీ జరిపాయని జసాని వివరించారు. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు 2 శాతం వరకూ పెరిగాయి. యూరప్ మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ముగిసాయి. 

ఎఫ్‌పీఐల దూకుడు

కొద్ది రోజులపాటు వరుస విక్రయాలకు పాల్పడిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి పెద్ద ఎత్తున భారత్ మార్కెట్లో నిధులు కుమ్మరించారు. గురువారం రూ. 3,260 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసిన ఎఫ్‌పీఐలు శుక్రవారం మరింత అధికంగా రూ. 5,318 కోట్లు నికర పెట్టుబడి చేసినట్లు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. 

బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫైనాన్స్ 2 శాతం పె రిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. బోనస్ షేర్లను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్ప నష్టాలతో ముగిసింది. టా టా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐటీసీలు కూడా రెడ్‌లో ముగిసాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా రియల్టీ ఇండెక్స్ 1.88 శాతం పెరిగింది. హెల్త్‌కేర్ సూచి 1.41 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.77 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.70 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.63 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.61 శాతం చొప్పున పెరిగాయి.  బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం చొప్పున లాభపడ్డాయి.