calender_icon.png 23 October, 2024 | 7:05 PM

10లక్షల ఎకరాలకు సాగునీరు

10-07-2024 05:43:31 AM

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • సీతారామ ఎత్తిపోతల పథకం పరిశీలన 

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, ఇది తన చిరకాల కోరిక అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  మంగళవారం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం, కమాలాపురం వద్ద గల సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ను  పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పూసుగూడెం, కమలాపురం పంపుహౌస్‌లకు షాంగై కంపెనీ ప్రతినిధులు రావాల్సి ఉందని, వీసా సమస్య రావడంతో భారత ప్రభుత్వం చైనా ప్రభుత్వంతో  మాట్లాడుతోందన్నారు. ఇప్పటికే ఇరిగేషన్, ఎలక్ట్రికల్ శాఖల పనులు పూర్తి అయ్యాయన్నారు.

చైనా బృందం వచ్చిన అనంతరం వారి ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆగస్టు లో ఎన్కూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. అనుకున్న సమయానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు రాకుండా ఉంటే నాగార్జునసాగర్ ఆయకట్టు వైరా ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా మధ్యలో ఉన్న ఇరిగేషన్ ట్యాంకర్ అన్నింటింకి బిల్డ్‌చేసి గోదావరి జలాలు తరలిస్తామని వెల్లడించారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయ్యే నాటికి గోదావరి జలాలు వాడుకోవడానికి అన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఎన్కూర్ లింక్ కెనాల్‌ను అత్యవసరంగా సీఎం అనుమతితో పనులు ప్రారంభించామని, ఈ నెలలోనే పూర్తి చేస్తామని చెప్పారు. యాతలకుంట టన్నెల్ వచ్చే సీజన్‌కి పూర్తి చేసుకొని సత్తుపల్లి, అశ్వారావుపేటలకు సాగునీరు అందిస్తామన్నారు. 

ఫారెస్టు  క్లియరెన్సు రావాలి..

మారిన అలైన్‌మెంట్ ప్రకారం జూలూరుపాడు టన్నెల్‌కు 10 కిలోమీటర్ల మేర ఫారెస్టు క్లియరెన్సు అనుమతులు రావాల్సి ఉందన్నారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షలు, సాగర్ ఆయకట్టు 3లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు. జూలూరుపాడు పూర్తయిన తర్వాత పాలేరు కి సాగునీరు అందిస్తామన్నారు. ఇల్లెందుకు రోళ్లపాడు నుంచి నీరిచ్చేందుకు యత్నించినా ఫారెస్టు  క్లియరెన్సు రాక సాధ్యం కాలేదని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్, నీటిపారుదలశాఖ సీఈ ఏ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ నివాస్‌రెడ్డి, ఈఈ సురేష్‌కుమార్, ఎస్పీ రోహిత్‌రాజు  తదితరులు పాల్గొన్నారు.