calender_icon.png 24 March, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

21-03-2025 05:37:44 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పది పరీక్షలు పట్టణం, మండలంలోని రామకృష్ణాపూర్ లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం ప్రథమ భాష పరీక్షకు 5 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకొని వారి హాల్ టికెట్ నెంబర్లను, పరీక్ష కేంద్రంలోని గదులను సరి చూసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉపాద్యాయులు క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాలకు అనుమతించారు.

పట్టణంలో తవక్కల్ పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, కార్మెల్ ఉన్నత పాఠశాల, బ్లెస్డ్ ఆల్ఫోన్సా కాన్వెంట్ స్కూల్ పరీక్ష కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 913 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరయ్యారని మండల విద్యాధికారి దత్తుమూర్తి(Ramakrishnapur Mandal Education Officer Dattu Murthy) తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా  అన్ని సౌకర్యాలు కల్పించామని, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇదిలా ఉండగా పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. పది పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ముగిసే సమయం వరకు పట్టణంలోని జీరాక్స్ సెంటర్లను మూసి ఉంచారు.