22-03-2025 12:04:46 AM
ఆదిలాబాద్, మార్చ్ 21 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, 880 మంది సిబ్బందిని నియమించారు.
అటు జిల్లా వ్యాప్తంగా 10,043 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకావాల్సి ఉండగా తొలి రోజు 10, 013 హాజరుకగా, 30 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా తొలి రోజు పరీక్షా కేంద్రా లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి విద్యార్ధుల హాజరు శాతాన్ని డీఈఓ ప్రణితను అడిగి తెలుసుకున్నారు.
పరీక్షా కేంద్రాలలో ఆన్ని మౌళిక వసతుల ను పరిశీలించి, పరీక్షలు అయ్యేంతవరకు పకడ్బందీగా వ్యవహరించాలని, విద్యార్ధులు సెల్ ఫోన్లు, ఎలాక్ట్రానిక్ పరికరాలు, తదితర పరీక్షా కేంద్రాలకు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 21(విజయకాంత్): పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో 6560 మంది విద్యార్థులు మొదటి రోజు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా 6531 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.29 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్...
జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల కొరకు 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,కేంద్రాలలో విద్యార్థుల కొరకు ఫర్నిచర్, ఫ్యాన్లు, వెలుతురు, త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య-ఆరోగ్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.పరీక్షలు జరిగే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని తెలిపారు.
ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు, ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.
మందమర్రి : రామకృష్ణాపూర్ లో తవక్కల్ పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, కార్మెల్ ఉన్నత పాఠశాల, రామకృష్ణాపూర్ లోని తవక్కల్ పాఠశాల, బ్లెస్డ్ ఆల్ఫోన్సా కాన్వెంట్ స్కూల్ పరీక్ష కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 913 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరయ్యారని మండల విద్యాధికారి దత్తుమూర్తి తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని వివరించారు.