calender_icon.png 24 September, 2024 | 6:03 AM

భూకేటాయింపు ఆలోచనను విరమించుకోవాలి

20-09-2024 12:00:00 AM

అంబేద్కర్ వర్సిటీ ఉద్యోగులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోని పది ఎకరాల స్థలాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఎఫ్‌ఏయూ)కి కేటాయించాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని ఓపెన్ వర్సిటీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వర్సిటీలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్న భవనాలు ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

విద్యార్థుల అవసరాల కోసం భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరుణంలో క్యాంపస్‌లోని స్థలాలను ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్తులో తమ యూనివర్సిటీ అభివృద్ధి, విస్తరణకు అవకాశం ఉండదని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ ఉద్యోగుల సంఘాల నాయకులు పల్లవి కాబ్దే, పుష్పా చక్రపాణి, మాధురి, చంద్రకళ, వెంకటరమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.