08-03-2025 12:00:00 AM
ఏప్రిల్ 2 తర్వాతే కెనడా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్
ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, మార్చి 7: సుంకాల విషయంలో కెనడాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఊరట కల్పించారు. కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించారు. కెనడాకు సంబంధించిన కొన్ని దిగుమతులకు మినహాయింపు ఇస్తూ 25 శాతం సుంకాల అమలును ఏప్రిల్ 2 వరకు నిలిపివేశారు. ఈ మేరకు సవరణ ఉత్తర్వులపై ట్రంప్ గురువారం సంతకం చేశారు.
అమెరికాలోకి అక్రమవలసలతోపాటు ఫెంటానిల్ సరఫరాను సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నాయనే కారణంతో మెక్సికో, కెనడా దేశాలకు సంబంధించిన దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఈ నెల 4 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ట్రంప్‌తో మెక్సికో అధ్యక్షురాలు సంభాషించారు.
మెక్సికో నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాల అమలు ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇందుకు సంబంధించి ట్రంప్ గురువారం సంతకం చేసిన ఉత్తర్వుల్లో కెనడాను కూడా చేర్చారు. ట్రంప్ మినహాయింపు ఇచ్చిన దిగుమతుల్లో కొన్ని ఇంధన ఉత్పత్తులతోపాటు వ్యవసాయంలో అధికంగా ఉపయోగించే పొటాష్ కూడా ఉంది.
పొటాష్‌కు అధిక సుంకాల నుంచి మినహాయింపు లభించడంతో అమెరికా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా కొన్ని ఇంధన ఉత్పత్తులకు మాత్రమే తాజా ఆదేశాలు వర్తించడానికి గల కారణాలను వైట్‌హౌస్ వెల్లడించింది. యూఎస్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పరిధిలోకి కొన్ని ఇంధన ఉత్పత్తులు మాత్రమే వస్తాయని పేర్కొంది. అందువల్లే అన్ని ఇంధన ఉత్పత్తులకు మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార టారిఫ్‌లపై ముందుకు వెళ్లనున్నట్టు అమెరికా ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ఫెంటానిల్‌ను అడ్డుకునే విషయంలో రెండు దేశాలూ పురోగతి సాధిస్తాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
అమెరికా బాటలోనే కెనడా
కెనడాకు సంబంధించిన కొన్ని దిగుమతులపై అమెరికా ప్రభుత్వం 25 శాతం సుంకాల విధింపు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపి వేయడంపై కెనడా స్పందించింది. అమెరికాకు దిగుమతులపై తమ దేశం ప్రకటించిన 25 శాతం సుంకాల ఆదేశాలను సైతం ఏప్రిల్ 2 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రెండో దశలో భాగంగా 125 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల విధింపును ఏప్రిల్ 2 వరకు నిలిపివేస్తున్నట్టు కెనడా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కన్నీరు
మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భావోద్వేగానికి లోనయ్యారు. తన తొమ్మిదేళ్ల పాలనా కాలంలో ఎదురైన సవాళ్లతోపాటు అమెరికా సుంకాలపై మాట్లాడుతూ కన్నీ రు పెట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రతిసారీ తాను కెనెడియన్ల ప్రయోజనాలకే తొలి ప్రాధా న్యం ఇస్తూ విధులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. తన ప్రభుత్వం చివరి రోజు వరకూ కెనడా ప్రజల ప్రయోజనాల కోసమే పని చేసినట్టు వెల్లడించారు. అమెరికా టారిఫ్‌ల అంశంతోపాటు విలీన అంశాలను ఉద్దేశిస్తూ భవిష్యత్తులో కెనడాకు అనేక సవాళ్లు ఎదురుకాబోతున్నట్టు హెచ్చరించారు. కెనడా ప్రజ లు ఐక్యంగా ఉండాలని ట్రూడో పిలుపునిచ్చారు. కాగా ప్రధాని పదవి నుంచి ట్రూడో తప్పుకోనున్నారు. లిబరల్ పార్టీ నేతలు ఆదివారం రోజు కొత్త నాయకున్ని ఎంపిక చేయనున్నారు.