- అభివృద్ధి పనులకు ఆటంకం
- సీఎంల భేటీ నేపథ్యంలో మళ్లీ మొదలైన చర్చ
- తెలంగాణలో కలపాలని ఐదు గ్రామాల ప్రజల వినతి
- రేవంత్‌ను కలిసి సమస్యను తెలిపిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3 (విజయక్రాంతి): రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రలో విలీనం చేశారు. పురుషోత్తంపట్నం ఏపీలో విలీనం కావడంతో భద్రాచల రామాలయ మాన్యం భూములు సుమారు 889 ఎకరాలు కూడా ఏపీ పరిధిలోకి వెళ్లాయి. ఆ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.
రామాలయ అధికారులను సైతం ఆ ప్రాంత వాసులు నిర్బంధించి, దాడులకు కూడా పాల్పడ్డారు. గత పదేళ్లుగా ఈ అంశంపై భద్రాచల ప్రజల్లో చర్చలు కొనసాగినా భూములు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితిలో రెండు ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ నెల 6న భేటీ కానున్న నేపథ్యంలో ఈ భూముల విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అభివృద్ధికి దూరమైన ఐదు గ్రామాలు
పోలవరంలో ముంపునకు గురికాని కన్యాయిగూడెం, పిచ్చుకులపాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం పంచాయతీలను సైతం ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభు త్వం గెజిట్‌ను విడుదల చేసింది. నాటి కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఆ ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. ఆ గ్రామాలు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. తమ జిల్లా కేంద్రానిక వెళ్లాలంటే ఆ గ్రామాల ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది.
అంతేకాకుండా ఏపీలో కలిపినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దీనికితోడు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజే డు మండలాలకు, పర్ణశాలకు వెళ్లాల్సి వస్తే భద్రాచలం నుంచి 7 కిలోమీటర్లు ఏపీ రాష్ట్ర పరిధిలో ప్రయాణించి తిరిగి తెలంగాణలోని దుమ్ముగూడెంకు చేరాల్సి వస్తుంది. ప్రతీ రోజు ఈ మార్గంలో వెళ్లే ప్రజలకు సరిహద్దు సమస్యలు ఎదురవుతున్నాయి. విభజన సమయంలో వాస్తవ స్థితిగతులు పరిశీలించకుండా ఢిల్లీ స్థాయిలో అధికారులు గెజిట్ విడుదల చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఎన్నికల్లో ప్రచార అస్త్రం..
గత పది సంవత్సరాలుగా ఈ సమస్య అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగపడింది తప్పా పరిష్కారం కాలేదు. ఆ గ్రామాలను తెలంగాణ లో కలపాలని ఏపీ మొదటి సీఎం చంద్రబాబును నాటి తెలంగాణ మంత్రి తుమ్మల కోరారు. అందుకు చంద్రబాబు సానుకూలతను వ్యక్తం చేసినా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఆ గ్రామాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు. రెండు రోజుల క్రితం ఈ సమస్యను మంత్రి తుమ్మల తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో ఆ గ్రామాల ప్రజలు రేవంత్‌రెడ్డిని కలిసే యోచనలో ఉన్నారు. దీనికి తోడు ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నిహితులు కావడం, ఈ నెల 6న విభజన సమస్యలపై బేటీ కానున్న నేపథ్యంలో ఆ ఐదు గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. భద్రాచలంలో పంచాయతీల విలీనం సులభతరం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.