- వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
- దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): రూ.400 కోట్లతో రాష్ట్రంలోని వివిధ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ బుధవారం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన సుదర్శన, గణపతి, నవగ్రహ చండీ హోమం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ.. వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లతో కట్టుదిట్టంగా ముందుకుపోతున్నట్లు తెలిపారు. రాష్ర్టంలో ప్రధాన పండుగలైన సమ్మక్క, సారాలమ్మ జాతర, బోనాల జాతరను ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని మంత్రి తెలిపారు. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమ్మక్క-సారాలమ్మ జాతరను నిర్వహణకు రూ.110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, రీజనల్ జాయింగ్ కమిషనర్ రామకృష్ణారావు పాల్గొన్నారు.