18-04-2025 01:12:13 AM
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
వేములవాడ, ఏప్రిల్-17(విజయక్రాంతి): శృంగేరి పీఠం అనుమతులతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి రాజరాజేశ్వర స్వామి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ అభివృద్ధి పై సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ చేపట్టుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కాళ భైరవ స్వామి, దక్షిణామూర్తి, వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి, సూర్య భగవానుడు, జ్వాలా ముఖి వంటి 8 ఉప ఆలయాలపై తదుపరి పాటించాల్సిన మార్గం, శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవలు ఏకాంతంగా జరుగుతాయనీ, ఎటువంటి లోటు పాట్లు ఉండవని తెలుపుతూ అవసరమైన మార్గదర్శకాలు, అనుమతులను ఈ నెల 27 వ తేదీన శృంగేరి పీఠం నుండి పొందాలని అన్నారు.
ఉప ఆలయాలకు ఎక్కడ కూడా అభివృద్ధి పనులో భాగంగా మూల విగ్రహాలను కదపకుండా కాశి, జోగులాంబ దేవాలయ పరిధిలో ప్రతిపాదించిన మాదిరిగా ఎటువంటి దోషాలు లేకుండా మాత్రమే అభివృద్ధి అవుతుందని, శృంగేరి పీఠం నుండి అనుమతులు పొంది, వారు సూచించిన మార్గాలను మాత్రమే అనుసరిస్తూ అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు.
ఆగమ, వాస్తు శాస్త్రాలకు విరుద్ధంగా ఎటువంటి పనులు చేయడం ఉండదని స్పష్టం చేశారు. భీమేశ్వర దేవాలయంలో దర్శనం ఏర్పాటు చేస్తున్నందున అవసరమైన పనులు ప్రతిపాదన చేసి ప్రభుత్వ అనుమతి తీసుకుని షార్ట్ టెండర్లు చేపట్టి ఆ పనులు పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం 76 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు భూసేకరణ పెండింగ్ లేదని అన్నారు. ఆలయ నిర్మాణ పనుల మానిటరింగ్ కమిటీని జూన్ నెలలో ఏర్పాటు చేయాలని అన్నారు.
ఫేస్ 1 లో రాజ గోపురాలతో ప్రాకార గోడ 40 కోట్ల ప్రతిపాదనలు 24 నాటికి అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ధార్మిక సలహాదారులు గోవింద హరి, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, రి, ఈఓ వినోద్, ఈఈ రాజేశ్, డీఈ రఘు నందన్, ఆర్‌అండ్ బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ బీ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.