* రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీరమణాచారి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డా.కేవీ రమణాచారి అన్నారు. ఖైరతాబాద్‌లోని ఐఐఎంసీ కళాశాల సభా ప్రాంగణంలో యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, సత్కళా భారతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న “ తెలుగు వెలుగు” కార్యక్రమ మూడవ సమావేశం ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం అధ్యక్షతన ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించే స్థాయికి యువభారతి సంస్థ ఎదగాలని ఐఐఎంసీ అనే సరస్వతీ నిలయం సాక్షిగా ఆశిస్తున్నానని చెప్పారు. గౌరవ అతిథి సత్కళా భారతి వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ.. నేటి యువతకు తెలుగు భాషపై మక్కువ తగ్గుతుందని అదేవిధంగా ఏఐ రావడం వల్ల పిల్లలో ఆలోచించే నైపుణ్యం తగ్గుతుందని తెలిపారు.
ఐఐఎంసీ కళాశాల ఆచార్యులు కూర రఘువీర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నిర్వహిద్దాం అనుకున్నప్పుడు 12సంస్థలు ముందుకు వచ్చాయని ఇప్పుడుఆ సంస్థల సంఖ్య 28కి చేరుకోవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది తెలియజేశారు. యువభారతి సంస్థ భవిష్యత్తులో ప్రపంచ తెలుగు మహాసభలు నిరహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రధాన వక్త ప్రముఖ నాటక రచయిత , కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్, యువభారతి అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర, సాహితీ అభిమానులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.