calender_icon.png 15 November, 2024 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు తెలుగు సబబే

10-11-2024 01:51:10 AM

నిబంధనలు సమర్థనీయమే: హైకోర్టు  

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్న నిబంధనను హైకోర్టు సమర్థించింది. పరీక్షల్లో తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలన్న నిబంధన చేర్చడానికి కారణాలను పేర్కొన్నందున, అందులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది.

అదేవిధంగా తెలుగు స్థానంలో ఉర్దూను చేర్చాలని కోరడానికి పిటిషనర్‌కు ఎలాంటి హక్కు లేదంటూ తేల్చింది. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ నిమిత్తం ఏప్రిల్ 10న జారీ అయిన నోటిఫికేషన్లో తెలుగులో ప్రావీణ్యం ఉండేలా జ్యుడిషియల్ సర్వీసెస్ నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 36ను సవాల్ చేస్తూ మహమ్మద్ షుజాత్ హుస్సేన్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీ రఘునాథ్ వాదనలు వినిపిస్తూ న్యాయసేవలు అందించడానికి తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి చేశారని, దీనికి అనుగుణంగా ఇంగ్లిష్ నుంచి తెలుగుకు తర్జుమా ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించిందని చెప్పారు.

ఉర్దూ ద్వితీయ భాషగా ఉన్నందున తెలుగుకు ప్రత్యామ్నాయంగా ఉంచాలని కోరారు. హైకోర్టు తరఫు సీనియర్ న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో 77 శాతం ప్రజలు తెలుగును మొదటి భాషగా ఎంపిక చేసుకున్నారని అన్నారు.

కేసుల విచారణలో మాతృభాషలో ఇచ్చే వాంగ్మూలాల నమోదు, బాధితులు తమకు జరిగిన అన్యాయం వివరించడానికి తెలుగు ఎక్కువ వాడుతుంటారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం నిబంధనలను సమర్థిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.