calender_icon.png 21 October, 2024 | 11:54 AM

మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ

18-10-2024 01:33:29 AM

నేడు ‘ఎఫ్-టామ్’ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత సభ

ముంబై, విజయక్రాంతి : మహారాష్ట్రలో నూతనంగా తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని ‘ఎఫ్-టామ్’ ప్రతినిధుల బృం దం పేర్కొన్నది. అకాడమీ ఏర్పాటు ద్వారా తెలుగు భాష, సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఉపయోగ పడుతుందని బృందం సభ్యులు తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సుధీర్ మునగంటివార్ సహాయా సహకారాలతో తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు సాకారం అయ్యిందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కృతజ్ఞతులు తెలిపేందుకు శుక్రవారం ప్రత్యేక సభ నిర్వహిస్తున్నట్టు ఎఫ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు, జనరల్ సెక్రటరీ కంటె అశోక్ తెలిపారు.

సాయంత్రం ౬ గంటలకు మాటుంగా కింగ్‌సర్కిల్‌లోని మైసూర్ అసొసియేషన్ హాల్‌లో కృతజ్ఞత సభ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలంతా తరలిరావా లని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ తరఫున రచయితలు, కళాకారులకు అందజేయనున్న అవార్డులపై చర్చించనున్నట్టు ఎఫ్-టామ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు తెలిపారు.

అకాడమీ తరఫున లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.లక్ష, నాలుగు క్యాటగిరీల్లో సాహిత్య అవార్డుల కింద రూ.౫౧ వేల చొప్పున అందించనున్నారు. కళా పురస్కార్ విభాగంలో రూ.౫౧ వేలు, బుక్ పబ్లిషింగ్ అలవెన్స్ కింద ఒక్కో పుస్తకానికి రూ.౨౫ వేలు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను  కృతజ్ఞత సభలో సాహిత్య అకాడమీ డైరెక్టర్ సచిన్ నింబాల్కర్ చెప్తారన్నారు. అనంతరం అకాడమీ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటిస్తారని జగన్‌బాబు వివరించారు.