calender_icon.png 1 November, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు సాహిత్య పుష్పగుచ్ఛం కవన గర్బరాలు

29-04-2024 12:05:00 AM

‘తెలుగులో ఎందరు కవులుంటారు’ అని ఎప్పుడైనా లెక్కబెట్టాలని అనిపించిందా? ఒక్కసారి ఆ ప్రయత్నం చేసిచూస్తే, లెక్కకు మిక్కిలిగానే సాహితీకారులు వున్నారనిపిస్తుంది. మనకు తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు, కవిత్వం మాత్రమే తెలిసి కవిపేరు తెలియని సందర్భాలు వుంటాయి కొన్నిసార్లు. ఎక్కడో నాలుగు పదాలు చదివి ఎవరోగాని ఎంత అద్భుతంగా రాశారో అనుకొని, ఆ అక్షరాలని దాచుకున్న సందర్భం ఒక్కటైనా ఉండదా! 

ఇదుగో, ఇలా వందేళ్ల కాలం నుంచి వందమంది కవులు, వాళ్లు రాసిన కవిత్వంలోని మెరికలు ఏర్చికూర్చి ఒక దగ్గర చేర్చిన ఇలాంటి పుస్తకాలు ఈమధ్య అతితక్కువే వచ్చాయి. సోషల్ మీడియాలో కొందరిని చూడగలిగినా ఒక పుస్తకంగా ఒకే దగ్గర చూడటం వేరు. వందమందికి పైగా ప్రాచీన కవుల దగ్గరి నుంచి సమకాలీన కవులదాకా, వారి గురించిన సమాచారాన్ని, ప్రతి కవినుంచీ కొన్ని కవితలనూ ఒక దగ్గరకు చేర్చారు. అంతేకాదు, అందులోని క్లిష్టమైన, మాండలిక పదాలకు అర్థాలనూ ఇచ్చారు. ఇలాంటి ఒక పుస్తకం తేవటం అభినందనీయం. ఇది తెలుగు సాహిత్యం మీదా, కవిత్వం మీదా ఇష్టమున్నవారికే కాదు, సాహిత్య విద్యార్థులకూ అవసరమైన సమాచార భాండాగారం లాంటిది. 

ఇందులో చేర్చబడ్డ కవుల్లో సంప్రదాయ కవిత్వాన్ని తలకెత్తుకున్న విశ్వనాథ సత్యనారాయణ, దళితవాదాన్ని గొంతెత్తి ఘోషించిన ఎండ్లూరి సుధాకర్ ఉన్నారు. స్త్రీవాద కవయిత్రి జయప్రభ, మైనారిటీ స్త్రీల స్వరాన్ని వినిపించే షాజహానా ఉన్నారు. నిన్నమొన్ననే వచ్చిన మట్టి వాసనల పల్లె కవిత వినిపించే తగుళ ్లగోపాల్ వంటి కవిని కూడా మరువలేదు. సినీకవులు సుద్దాల అశోక్ తేజ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, విప్లవ స్వరాన్ని ఎలుగెత్తుతున్న కే క్యూబ్ వర్మ... ఇలా ఎన్నో వాదాలకు, మరెన్నో వర్గాలకు ప్రతినిధులుగా నిలబడ్డ కవుల దాకా ఇందులో స్థానం సంపాదించుకున్నారు. గేయ కవితల నుంచీ ఈనాటి వచన కవితలదాకా అన్ని రకాల కవితలనీ ఒకే దగ్గర చదువుకోవచ్చు. 

ఒక వాదాన్నో వర్గాన్నో దృష్టిలో ఉంచుకోకుండా నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. కొన్ని సంవత్సరాల పాటు శ్రమిస్తే తప్ప ఇంత సమాచారాన్ని సేకరించటం, సంకలన పరచటం సాధ్యంకాదు. సంకలన కర్తలు చేపూరి సుబ్బారావు, వీకే ప్రేమ్‌చంద్‌లు అందించిన ‘కవన గర్బరాలు’ ఈ కాలానికి తెలుగు సాహిత్యపు డాక్యుమెంట్ అనవచ్చు. ‘గర్బరాలు’ అనే మాట తెలుగు నిఘంటువులో కనిపించక పోవచ్చు. ఇలాంటి పుస్తకాన్ని మల్లెలు, సిరిమల్లెలు లాంటి పేరుని ఊహించటం మామూలే. కానీ, గర్బేరా ఫ్లవర్స్ లాంటి పువ్వులని ప్రతీకగా తీసుకోవటంలోనే సాంప్రదాయ ఆధునికతల కలయిక కనిపిస్తోంది. 

నరేష్కుమార్ సూఫీ


కవన గర్బరాలు: 100 సంవత్సరాల సాహిత్య 

సంపద నుండి ఏర్చి, కూర్చిన కవితలు, విశ్లేషణలు.

సంకలన కర్తలు: చేవూరి సుబ్బారావు, వి.కె.ప్రేమ్‌చంద్, 

పేజీలు: 1074, వెల: రూ.600/- 

ప్రచురణ: వెల్చాల కేశవరావు మెమోరియల్ ట్రస్ట్, 

హైదరాబాద్, ప్రతులకు: వి.కె.ప్రేమ్‌చంద్, 102, బి శ్రీనిలయ ఏసియన్ మనోర్, రోడ్ నెం: ౨, బంజారాహిల్స్, హైదరాబాద్ 

సెల్: 9848052486