దేవులపల్లి రామానుజరావు అచ్చమైన కర్మయోగి. ఫలాపేక్షలేని వారు కనుక సన్యాస పదానికీ అర్హులే. చాలామంది ‘కర్మలను త్యజించిన వారిని సన్యాసులు’ అంటారు. కాని, కర్మలు కాక కర్మఫలాన్ని విడిచిన వారే అస లు సన్యాసులు. దేవులపల్లి ఏనాడూ తన కీ లాభం కలగాలని తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేయలేదు. వరంగల్లులో జన్మించిన దేవులపల్లి ‘ఓరుగల్లు కోటను గోల్కొండ కోటకు తెచ్చినాడా’ అనిపిస్తుంది.
1917లో బొల్లికుంటలో పుట్టిన రామానుజరావుకు హైదరాబాద్‌లోని బొగ్గులకుంట కార్యక్షేత్రమైంది. అక్కడినుంచి వారు 50 ఏండ్లుగా తెలుగు వాఙ్మయ శంఖారావాన్ని వినిపించారు. నిజాం కాలంలో అస్తిత్వాన్ని కోల్పోయిన తెలు గు భాషాప్రియుల హృదయ క్షేత్రాలలో చైతన్య బీజావాపన చేసింది వారే. ఒంటరిగా చేసినా, నలుగురితో కలిసి చేసినా ఆయన పరమలక్ష్యం తెలంగాణలో తెలు గు దీపం ఆరిపోకుండా వెలిగింపజేయడమే.
తెలుగువారికి వెలుగుదారి
ఉర్దూ బురఖా వేసుకున్న తెలంగాణ దుస్థితి దేవులపల్లిని కంటనీరు పెట్టించింది. అందుకే, ఆయన తన జీవితకాలంలో అర్ధ శతాబ్దిని తెలుగు భాషా సాహిత్యాల వికాసానికే వెచ్చించారు. నిద్రాణస్థితిలో ఉన్న తెలుగును అప్పటి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ద్వారా మేలుకొల్పారు. వైతాళిక కృషితో భాషాప్రియులకు చిరస్మరణీయులైనారు. పరిషత్తును అన్ని విధాలుగా అభి వృద్ధి పథంలో నడిపించారు.
ప్రాథమిక, ప్రవేశ, విశారద పరీక్షలను నిర్వహించారు. తెలుగు రాని తెలుగు వారికి వెలుగు దారి చూపెట్టారు. పండిత శిక్షణ కళాశాల ద్వారా వేలాదిమందిని తెలుగు పండితులను చేశారు. ప్రాచ్య కళాశాలను స్థాపించి, పండితులను ఆచార్యులుగా నియమించి మావంటి విద్యార్థులెందరో విద్యాభివృద్ధిని సాధించడానికి బాటలు వేశారు. సారస్వత పరిషత్తు నగరం నడిబొడ్డున వెలసిన భాషా సంస్థ. ఇక్కడి గ్రంథాలయం తెలుగు గ్రంథాలయాలకే తలమానికం.
అరుదైన పుస్తకాలను లైబ్రరీలో భద్రపరచి, పరిశోధకులకు మేలు చేసిన గౌరవం రామా నుజరావుదే. రామానుజరావు ఆధ్వర్యంలో అద్భుతమైన గ్రంథాలు ముద్రితమైనాయి. భాగవత సప్తాహా లకు, సాహిత్య ప్రక్రియలపై ఉపన్యాసాలకు విలక్షణ సారస్వత వేదికగా మారింది పరిషత్తు. ఈ సంస్థకు దేవులపల్లి వారి నేతృత్వం లభించడం తెలంగాణ ప్రజల అదృష్టమనే చెప్పాలి.
అంతేకాదు, అదే సమయంలో నాటి ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’కి కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా వారు అందించిన సేవ లు నిరుపమానమైనవి. ఇటు పరిషత్తులోను, అటు అకాడమి లోను ఉద్ధండ పండితులతో ఉపన్యాసాలు ఏర్పా టు చేసి, విలువైన గ్రంథాలకు పీఠికలు రాయించి, వారిని సముచిత రీతిలో సత్కరించిన ఘనత కూడా వారిదే. తన హయాంలో ప్రసిద్ధమైన కావ్యాలు కేవలం ఒక రూపాయకే మాతృభాషాభిమానులకు అందించడం విశేషం.
20 ఏండ్లపాటు సంపాదక బాధ్యతలు
రామానుజరావు వారిది తెలుగుభాషా వికాసదృష్టి. వారు ఏ వేదిక ఎక్కినా తెలంగాణ వైభవాన్నే కళ్లకు కట్టినట్టు తెలియజేసేవారు. రామానుజరావు బారిష్టరు డిగ్రీ అందుకున్నప్పటికీ న్యాయవాద వృత్తిలో ప్రవేశించక, మాతృభాషా సంరక్షణకు చెందిన కార్యక్షేత్రంలో స్థిరపడి తెలుగు భాషా సాహిత్యాల కోసం పాటుపడ్డారు. వారు స్వయంగా కవులు. ‘పచ్చతోరణం’ (పద్య సంకలనం) వారికి గల పద్య నిర్మాణ దక్షతను చాటుతుంది. అందులో రాయప్రోలు వారిని స్తుతిం చినప్పటికీ తెలుగు భాషను మెచ్చుకున్న తీరే కనిపిస్తుంది.
‘తెలుగునాడు నీది, తెలుగుబిడ్డవు
నీవు తెనుగటన్న నీకు తీపి మెండు
తెనుగు కన్నె జడల దీర్చి మక్కువ తోడ
తెనుగు తోటలందు ద్రిప్పినావు’
ఈ పద్యం విన్న రాయప్రోలు వారు రామానుజరావు వారిని ‘గణుతికెక్కిన యువకవి’గా కొనియా డారు. కవిగానే కాక పత్రికా సంపాదకునిగానూ వారు చేసిన సేవలు మరచిపోలేనివి. 1947లో వరంగల్ నుంచి వెలువడిన ‘శోభ’ మాసపత్రికకు వారే సంపాదకులు. ‘గోలకొండ’ పత్రికకు 20 సంవత్సరాల పాటు సంపాదకత్వ బాధ్యతలలో పాలుపంచుకున్నా రు. అప్పటి వారి సంపాదకీయాలు తెలంగాణ ప్రజలను ఎంతో జాగృతం చేశాయి. ‘సుజాత’ పత్రికనూ కొన్నాళ్లు నడిపారు. ఆ పత్రిక నిజంగా తెలంగాణ యువతలో ఎంతో చైతన్యాన్ని తెచ్చింది.
రామానుజరావు ఎన్నో గ్రంథాలు రచించారు. అవి తెలుగు కవిత్వానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి అద్దం పడతాయి. వారి సాహిత్యోపన్యాసాలు, తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం, 50 సంవత్సరాల జ్ఞాపకాలు మొదలైన రచనలు రామానుజరావుని విశిష్ట గ్రంథకర్తగా నిరూపిస్తాయి. ఆయన ‘గోలకొండ’ వంటి పత్రికలలో రాసిన వ్యాసాలు అనేక కొత్త విషయాలను తెలియచెప్పాయి. దేవులపల్లి ప్రాచీన, నవీన సాహిత్యాలకు వారధిగా పనిచేశారు. ప్రాక్ పశ్చిమ కవితారీతులను అవలోకనం చేశారు. వారికి సాహితీమూర్తులతోపాటు యువకవులుకూడా సన్నిహితులే. దాశరథి, సినారె వంటి మహాకవులు ఆయన ప్రశంసలకు పాత్రులైనారు.
రామానుజరావు మంచి పరిపాలనా దక్షులు. ఏ పదవిలో ఉన్నా, వారివల్ల పదవికే గౌరవం హెచ్చింది. పరిషత్తు, అకాడమిలకు సారధ్యం వహించడమేగాక కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ భారతీయ భాషా సమితి సభ్యులుగా, హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, మొదటి ప్రపంచ తెలుగు మహాసభల కోశాధ్యక్షులుగా, తెలుగు అకాడమిల కార్యవర్గ సభ్యులుగా ఆయన అందించిన సేవలు అనితర సాధ్యం. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీమహా విద్యాలయంగా మార్చడానికి జరిగిన ప్రయత్నాలను ధిక్కరించిన సాహసి దేవులపల్లి. వారు తాత్కాలిక ఉపకులపతిగాను నియమితులైనారు.
రిక్షాలోనే రాకపోకలు
మాడపాటి, సురవరం, బెజవాడ వంటి దిగ్దంతులైన పండితులతో కలిసి పనిచేసిన రామానుజరావు తన జీవితంలో ఎన్నడూ అన్యాయంతో రాజీ పడలేదు. తెలుగు సాహిత్యాభివృద్ధినే స్వీయాభివృద్ధిగా భావించిన నిష్కళంక జీవి. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్‌తో గౌరవించినప్పుడు సాహితీలోకం మురిసిపోయింది. ఆయన నిజంగా తెలంగాణ వైతాళికుల్లో ఎన్నదగిన సాహితీమూర్తి, మహామహు లు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకుగాని, ఇతర ఏ సంస్థకుగాని వెళ్లాలన్నా ఆయన వాహనం రిక్షాయే. ఈ గొ ప్పతనానికి నేను అప్పట్లోనే ఒక పద్యరూపమిచ్చాను.
‘సృష్టి రచన జేసి జీవకోటికి భద్ర
మందించు బ్రహ్మ వాహనము హంస;
దుష్టు శిక్షించి, శిష్టుల రక్షించు
నారాయణుని వాహనమ్ము ఖగము;
ప్రళయమ్ము సృష్టించి పరితృప్తి నొందెడి
నటరాజునకు వాహనమ్ము నంది
దేవ విభుండైన దేవేంద్రునకు బ్రీతి
గావించు బండి ఐరావతమ్ము
మా ప్రజానాయకులను విమానములును
బెంజికార్లును కడు సుఖపెట్టు చుండ
స్వార్థ మెరుగని దేవులపల్లి! మీకు
వాహనంబయ్యె రిక్షయే బ్రతుకునిండ’.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన కవికోకిలలకు రసాలం. పేద రచయితలకు కల్పవృక్షం. వాదాలు చేసేవారికి సమన్వయ వేదిక. తెలుగు సారస్వత మూర్తుల్లో శిఖరాయమానుడు.
వ్యాసకర్త సెల్: 9885654381