calender_icon.png 19 November, 2024 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రరాజ్యంలో తెలుగు వాణి

30-06-2024 12:00:00 AM

ఎక్కడ చూసినా తెలుగే... ఎక్కడ విన్నా తెలుగే...  యూనివర్సిటీలు, ఆఫీసులు.. ఇలా ఎక్కడ చూసినా  తెలుగు స్వరం వినిపి స్తూనే ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారు. మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనో...  ఇతర రాష్ట్రాల్లోనో  కాదు.  ఖండాలు దాటి అగ్రరాజ్యమైన అమెరికాలో. 350 ప్రపంచ భాషల్లో11వ స్థానంగా మన తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి తెలుగు వెలుగు విశ్వవ్యాప్తమైంది. గత నాలుగేళ్లలోఅమెరికాలో తెలుగు మాట్లాడే వారు, తెలుగు వారి శాతం అధికంగా పెరిగి మన తెలుగు స్వరం వినబడుతోందంటే సంతోషమే కదా! గతంలో అమెరికాలో మన తెలుగు భాష కంటే ముందుగా భారతీయ భాషల్లో హిందీ, గుజరాతీ అగ్రస్థానంలో ఉండేవి. అయితే కొన్నేళ్లుగా మన దేశం నుండి అమెరికాకు వెళ్తున్న వారిలో తెలుగు వారి  సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఈ పరిణామం జరిగిందని చెప్పవచ్చు.

మన దేశంనుంచి ఉపాధి కోసమో, వృత్తి బాధ్యతల కోసమో అమెరికాకు వెళ్తున్న వారిలో మన తెలుగువారు ఎక్కువగా ఉన్నారు.  2016తో పోలిస్తే  2024 లో నాలుగు రెట్లు పెరిగిందని సెన్సస్ బ్యూరో డేటా నివేదికలో వెల్లడి అయ్యింది. అప్పట్లో మూడు లక్షల వరకు ఉండే తెలుగు  వారి సంఖ్య ప్రస్తుతం 12 లక్షలు దాటింది. కాలిఫోర్నియాలో 2లక్షల మంది, టెక్సాస్‌లోలక్షన్నర మంది, న్యూ జెర్సీ, ఇల్లినాయిస్, వర్జినియా,  జార్జియాలలో కలిపి మూడు లక్షల ముప్పు వేలు ఉన్నారు. ఏటా అమెరికాకు వెళుతున్న తెలుగువారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,30,000 మంది విద్యార్థులు, 10 వేలమందికి పైగా హెచ్ 1బి వీసా తీసుకున్న వాళ్లు ఉంటున్నారు. అమెరికాలో ఉండే అన్ని దేశాల వారు బయట మాట్లాడేది ఇంగ్లీష్ ఐనా మనవారు మాత్రం ఇంట్లో  మాట్లాడేది తెలుగే.

ఇకపోతే అమెరికాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందని చెప్పవచ్చు. మన దేశంతో పోల్చితే అమెరికా 3 రెట్లు పెద్దది. జనాభాలో మాత్రం మూడు వంతులు తక్కువే ఉంటుంది. వాతావరణ పరిస్థితులు కూడా కాలుష్య రహితంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఎవరికి వారు తమ పని చేసుకొని పోతూ ఉంటారు.అవకాశాలు ఎక్కువే ఉంటాయి. మంచి నిర్మాణాత్మకమైన విద్యాసంస్థలు, మైదానాలు, మెరుగైన రవాణా సదుపాయాలు ఉంటాయి. 12 గ్రేడ్ (అంటే ఇంటర్మీడియట్ అయిపోయేం తవరకు కూడా) వరకు విద్య ఉచితంగా ఉంటుంది. ఆ తరువాత ఉద్యోగంలో వచ్చేటువంటి జీతాల తో ఇల్లు కొనుక్కోవడం కూడా సులభంగా ఉంటుంది. ఎటువంటి కులమతాలకు తావు లేకుండా జీవనం కొనసాగుతుంది.మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి వారంలో రెండు రోజులు సెలవులు ఉంటుంది. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది.  ఏది ఏమైనా ఖందాంతరాలు దాటి అగ్రరాజ్యంలో మన తెలుగు భాష ప్రాధాన్యత పెరుగుతోందంటే మనమంతా గర్వించదగ్గ విషయం.  

 డా. చిటికెన కిరణ్‌కుమార్