22-02-2025 12:00:00 AM
‘విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డ్ ప్రదానోత్సవంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
‘విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డ్ ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ యేటి పురస్కారం చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కింది. శ్రుతిలయ సీల్ వెల్ కార్పొరేషన్- కళాకారుల ఐక్యవేదిక సమక్షంలో ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా ఈ వేడుక నిర్వ హించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత, దర్శకుడు జంధ్యా ల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ జరిగింది.
నటుడు డాక్టర్ నరేశ్ వీకే సమక్షంలో జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర శానన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నటులు మంచు విష్ణు, శివబాలాజీ, పవిత్ర లోకేశ్, జంధ్యాల అన్నపూర్ణ తదితరులు ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నా రు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. ‘జంధ్యాల 75వ జయంతి సందర్భంగా వజ్రోత్సవ సంచికను నేను ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నా. విజయనిర్మల 200 సినిమాల్లో నటించి, 44 సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం వారి ప్రతిభకు నిదర్శనం.
ఆమె తెలుగు బిడ్డ కావడం మన తెలుగుజాతికి గర్వకారణం, ఆదర్శం. జబ్బులు నయం చేసేది మందులైతే మనసులో బాధను నయం చేసేది హాస్యం. హాస్యాన్ని తెరపై పండించడంలో జంధ్యాల తిరుగులేని వ్యక్తి. తెలుగు సినిమా ఉన్నంతకాలం విజయనిర్మలను, జంధ్యాలను తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. అనిల్ రావిపూడికి మంచి భవిష్యత్తు ఉంది. హైదరాబాద్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం చాలా సంతోషం’ అన్నారు. అవార్డ్ గ్రహీత డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘కృష్ణ రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి.
వారి పేరు మీద ఈ అవార్డ్ తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నా. జంధ్యాలకు నేను ఏకలవ్య శిష్యుడిని. నరేశ్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం ఆనందంగా ఉంది. మళ్లీ ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ.. ‘ఒక ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది. అది సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నా జీవితానికి దేవుడు. నాకు ఇద్దరు గురువులు.. అమ్మ విజయనిర్మల, జంధ్యాల. జంధ్యాలపై పుస్తకం రాసే బాధ్యతను రచయిత సాయినాథ్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. జంధ్యాల వజ్రోత్సవ సంచిక పుస్తకం ఆవిష్కరణ, 46 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు అమ్మ విజయ నిర్మల జయంతి ఉత్సవాలు జరుపుకోవ డం ఆనందంగా ఉంది.
ఎవరికీ సినిమా అవకాశం అడగొద్దు. అదే వస్తుందనే జంధ్యాల మాటను నేను వేదంలా పాటించాను. అయితే అనిల్ రావిపూడిని మనం ఎందుకు కలిసి సినిమా చేయకూడదని అడిగాను. హాస్యం పండించే సత్తా ఉన్న దర్శకులు వందలో ఒకరో ఇద్దరో ఉంటారు. ఈ తరంలో అనిల్ రావిపూడి. ఆయన్ను చూస్తే జంధ్యాల గుర్తుకువస్తారు. నందినిరెడ్డిని చూస్తే అమ్మ గుర్తుకువస్తారు. అమ్మ బర్త్ డేతోపాటు పవిత్ర బర్త్ డే కూడా ఈరోజు రావడం ఆనందంగా ఉంది. ఇవన్నీ కలిపి ఓ వేడుకలా జరుపుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు. కార్యక్ర మంలో హీరో మంచు విష్ణు, జంధ్యాల వజ్రోత్సవ సంచిక రచయిత సాయినాథ్ తోటపల్లి, యాక్టర్ ప్రదీప్, నటి శ్రీలక్ష్మి, రచయిత సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.