* మన్ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ప్రముఖ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ పలు విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అక్కినేనిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు సినిమా పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని కొనియాడారు. అక్కినేని సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చక్కగా చూపించేవారని గుర్తు చేశారు. అలాగే రాజకపూర్ కూడా తన సినిమాల ద్వారా దేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు.
బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని మోదీ పేర్కొన్నారు. భారత చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మన దేశంలో తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించ బోతున్నామని మోదీ ప్రకటించారు. ఈ సమ్మిట్‌లో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజాలు పాల్గొంటారని చెప్పారు.