తప్పుదారి పట్టిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది
- పలువురు ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
- 15 మంది ఇంజినీర్ల విచారణ పూర్తి
- సోమవారం నుంచి తిరిగి విచారణ.. ఈసారి ఐఏఎస్ అధికారుల వంతు
హైదరాబాద్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): వాస్తవాలు దాచిపెట్టి కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని.. వాస్తవాలను దాచినా తాము బయటకు తీస్తామని కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జరిగిన, చూసిన, చేసిన పని గురించి వాస్తవాలు చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. ఇంజినీర్లు అయి ఉండి మీరు విధులు నిర్వర్తించిన పనిని గురించి చెప్పేందుకు ఎందుకు అవస్తలు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం 15 మంది ఇంజినీర్లను విచారించింది.
ఈ సందర్భంగా అన్నారం, సుందిళ్లలో పనిచేసిన ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు ఆంగ్ల భాషను అర్థం చేసుకోలేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇంగ్లిష్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఈ జీ శంకర్ నాయక్‌ను ఉద్దేశించి అన్నారు. డిజైన్ ఫ్లడ్స్ అంటే కూడా తెలియకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎలా పనిచేశారని సీఈని ప్రశ్నించారు.
అఫిడవిట్‌లో ఉన్న అంశా లు క్షేత్రస్థాయిలో లేవని.. ఇంజినీర్లు చిత్తశుద్దితో పనిచేస్తే బ్లాకులు ఎందుకు కొట్టుకుపోయాయని ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌లలో నీటి లభ్యత అంశంలో నిర్మాణ సంస్థలే పరీక్షలు చేశాయని చెప్పిన సీఈ.. నీటి లభ్యత పరీక్షల నివే దికలు పూర్తికాకముందే బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టినట్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు.
అన్నారం,- సుందిల్ల బరాజ్‌ల నిర్మాణ స్థలాలు మారినట్లు కూడా ఆయన అంగీకరించారు. 2020లో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు, నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. కాగా.. పలు అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని.. ముందుగా అనుకొని వచ్చి అసంబద్ధమైన సమాధానాలు చెబితే కుదరదన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజినీర్లు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కమిషన్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను కమిషన్ స్వాధీనం చేసుకుని.. రిజిస్టర్లలో ఇంజినీర్ల చేత సంతకాలు తీసుకున్నారు.
క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు కొన్ని మిస్సయినట్లుగా కమిషన్ గుర్తించింది. కమిషన్ విచారణ ప్రారంభం అయినప్పటి నుంచి బుధవారం వరకు 90 మంది ఇంజినీర్లను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. తిరిగి సోమవారం నుంచి విచారణ జరుపనున్న కాళేశ్వరం కమిషన్.. ఈసారి ఐఏఎస్‌లను విచారించనుంది.
ఇంత ఘోరం ఎక్కడా లేదు..
రిటైర్డ్ ఈఈ కే విఠల్ రావు సైతం విచారణకు హాజరై ప్రాజెక్టు నిర్మాణంపై పలు విషయాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి అధ్యయనం, పరిశోధన చేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించిన ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. బరాజ్‌లను కాస్త రిజర్వాయర్లుగా మార్చడంతో ఈ దుస్థితి తలెత్తిందన్నారు.
ప్రపంచంలో ఏ ఇంజినీరింగ్ నిపుణులు చేయనివిధంగా కాళేశ్వరం పనులుచేశారని ఫలితంగానే ప్రాజెక్టు నాశనమైపోయిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంత ఘోరం ఎక్కడా లేదన్నారు. బరాజ్‌ల సామర్థ్యాలను విపరీతంగా పెంచి నాశనం చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కనీసం ఓ సీఈ స్థాయి వ్యక్తి కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని ఆయన కమిషన్‌కు తెలిపారు.