calender_icon.png 23 September, 2024 | 10:38 AM

మీ సెల్ వేరు.. నా సెల్ వేరు అని చెప్పా!

22-09-2024 12:00:00 AM

రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. కేఈ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడుతూ.. “ సాధారణంగా ఓ సినిమా హిట్ తర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లో ఓ టెన్షన్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటారు. హిట్ తర్వాత హిట్ మూవీ ఇవ్వాలనే టెన్షన్ అందరికీ ఉంటుంది. సాధారణంగా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ అలా కుదరాలి.

‘జైలర్’ మూవీ హిట్ తర్వాత నేను ‘జై భీమ్’ సినిమాను చూశాను. అప్పుడే సౌందర్య నా దగ్గరకు వచ్చి జ్ఞానవేల్ దగ్గర మంచి లైన్ ఉందని, వినమని చెప్పింది. అప్పుడే తెలిసింది జ్ఞానవేల్ డైరెక్టర్‌గా మారక ముందు ఓ జర్నలిస్ట్ అనే సంగతి. మరోసారి ‘జైభీమ్’ సినిమా చూశాను. ఎవరి దగ్గరా దర్శకత్వ శాఖలో పనిచేయని వ్యక్తి ‘జైభీమ్’ను ఇంత గొప్పగా ఎలా తీశాడా?! అని ఆలోచించాను. తర్వాత జ్ఞానవేల్‌ను కలిశాను. మీరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. కానీ, తను చెప్పిన కథ నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చేయమని చెప్పాను” అని తాను ఈ సినిమాలో భాగమైన తీరును చెప్పారు రజనీ.

‘ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో నటింటానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఈతరం పిల్లలకు అమితాబ్‌గారు ఎంత పెద్ద నటుడో తెలియదు. నేను ఆయన్ను దగ్గర నుంచి చూశాను’ అని తెలిపారు. ఫహాద్ ఫాజిల్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్రను ఎలా చేస్తాడోనని అనుకున్నాను. చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈతరంలో తనలాంటి నటుడ్ని నేను చూడలేదు’ అని అన్నారు.

‘రామానాయుడుగారి మనవడిగా రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బయటకు నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్టర్‌గా ఆయన మారిపోతారు’ అని చెప్పుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ‘రజినీకాంత్ వృత్తి పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నాకెంతో సన్నిహితంగా ఉంటారు. ఆయనతో యాక్ట్ చేయడం గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను. తను మనందరికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.