calender_icon.png 23 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ నగరాలతో తెలంగాణ పోటీ

23-01-2025 01:39:46 AM

* ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

* హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ర్ట సీఎం ఫడ్నవిస్

హైదరాబాద్, జనవరి 22(విజయక్రాంతి): తెలంగాణ పక్క రాష్ట్రాలతో పోటీపడటం లేదని ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, యువతే తమ పెద్ద బలం అన్నారు. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తూనే.. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్‌లో జరిగిన ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రేవంత్‌రెడ్డితో వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ సీఎం చంద్రబాబు,  మహారాష్ర్ట సీఎం ఫడ్నవీస్‌తో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాము సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నదుల నీటిని కూడా పంచుకుంటున్నామని గుర్తు చేశారు.

ఈ నదులు మహారాష్ర్ట నుంచి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయన్నారు. ఎన్నికలప్పు డే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత అభివృద్ధిని సాధించడమే తమ ప్రాధాన్యమన్నారు. న్యూయార్క్, టోక్యో లాంటి నగరాల స్థాయికి అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. 

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..

కంప్యూటర్స్, టెలికాం రంగాల్లో రాజీవ్ గాంధీ ప్రారంభించిన సంస్కరణలు, పీవీ నరసింహరావు సరళీకృత ఆర్థిక విధానాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడే మార్గాన్ని  చూపించారన్నారు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణమని కొనియాడారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న భారత ప్రధాని లక్ష్యసాధనలో తెలంగాణ భాగస్వామ్యమవుతుందన్నారు.

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకుపోతోందని స్పష్టం చేశారు. తెలంగాణను మూడు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ లోపల కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెండో భాగం ఓఆర్‌ఆర్ నుంచి 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే 65 శాతం తెలంగాణ నగర ప్రాంతంగా మారుతుందన్నారు.

ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పట్టణీకరణ చాలా కీలకమన్నారు. తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు చేపల ఎగుమతి పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని అనుకుంటున్నట్లు సీఎం చెప్పారు.  ప్రపంచం ఎలా పురోగమిస్తుందో తెలుసుకోవడానికి దా వోస్ పర్యటన ఉపయోగపడిందని, అదే సమయంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షిం చాలని అనుకుంటున్నామన్నారు. కార్యక్రమానికి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సమీర్ సరన్ సంధానకర్తగా వ్యవహరించారు.