calender_icon.png 6 October, 2024 | 6:07 PM

తెలంగాణపె కేంద్రం వివక్ష

06-10-2024 02:12:41 AM

రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం శూన్యం

వరదలతో రూ.10 వేల కోట్లు నష్టపోతే ఇచ్చేంది 400 కోట్లే 

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా తెలంగాణకు ఏం లాభం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం చూపుతున్న వివక్షత విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని మంత్రి పొన్నం నిలదీశారు.

శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని, కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు చెప్పామని, కానీ కేంద్రం మాత్రం రూ.400 కోట్లే ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని, బడ్జెట్‌లోనూ నిరాశే మిగిల్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, డీఎస్సీ, ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ.150 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

గతంలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న తాను.. గురుకులాల విద్యా సంస్థలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,029 గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ.. చాలా వాటికి సొంత భవనాలు లేవన్నారు. 

మంత్రి సురేఖకు అండగా ఉంటాం.. 

మంత్రి కొండా సురేఖకు తామందరం అండగా ఉన్నామని మంత్రి అన్నారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఉపసంహరించుకున్నట్లు చెప్పినా.. ఇంకా చర్చ కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. కొండా సురేఖను తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా  చెప్పారని మంత్రి తెలిపారు. మంత్రి సురేఖ ఇబ్బందిపడినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.