calender_icon.png 26 October, 2024 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వైతాళికుడు దాశరథి

23-07-2024 01:40:05 AM

  1. రవీంద్రభారతిలో ఆయన శతజయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి
  2. కవి జూకంటికి దాశరథి సాహిత్య పురస్కార ప్రదానం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా నినదించి రాష్ట్రంలో ఉద్యమ చైతన్యం కలిగించిన కవి వైతాళికుడు, ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌తో కలిసి పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి దాశరథి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఆస్తిత్వాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పిన దాశరథి చిరస్మరణీయుడు పేర్కొన్నారు. దాశరథి సొంత జిల్లా మహబూబాబాద్‌ను దాశరథి జిల్లాగా ప్రకటించాలని ఆయన కుటుంబ సభ్యులు మంత్రి జూపల్లిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. 

సాహిత్య పురస్కారం ప్రదానం

దాశరథి కృష్ణమాచార్య సాహిత్య  పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు మంత్రి జూపల్లి ప్రదానం చేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదును, జ్ఞాపికను అందజేసి శాలువాతో జూకం టిని మంత్రులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథం, ప్రజాకవి, తెలంగాణ రాష్ట్ర గేయ రచయత అందెశ్రీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాలా, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ నమోజు బాలచారి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, కూతురు ఇందిర పాల్గొన్నారు.