రాష్ట్రాన్ని ప్రకృతివనంగా మారుస్తాం
- ప్రతి విద్యార్థి తల్లి పేరిట మొక్కలు నాటాలి
- వికారాబాద్ కేంద్రంగా ఎకో టూరిజం అభివృద్ధి
- ‘ఎక్స్ పీరియం’ పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
చేవెళ్ల, జనవరి 28: తెలంగాణను ప్రకృతి వనంలా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రతి విద్యార్థి తమ తల్లిపేరు మీద ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో ఎకో, హెల్త్, టెంపుల్ టూరిజం అభివృద్ధే లక్ష్యంగా త్వరలో టూరిజం పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు.
శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ పరిధిలో 25 వేల జాతుల మొక్కలు, వైవిధ్యమైన శిల్పాలతో దాదాపు 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం’ పార్కును మంగళవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్క్ ఫౌండర్ రామడుగు రామ్‌దేవ్ రావు, సినీ నటుడు చిరంజీవితో కలిసి సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. రామ్‌దేవ్ ఏర్పాటుచేసిన ఎకో ఫ్రెండ్లీ పార్కు ఒక అద్భుతమని.. ఇది అతనికే కాదు రాష్ట్రానికి కూడా గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంని అభినందించారు. ఎక్స్పీరియం పార్కు అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో అన్ని సహజవనరులు ఉన్నా గత ప్రభుత్వం ఎకో, టెంపు ల్, హెల్త్ టూరిజం మీద ఫోకస్ పెట్టలేదన్నారు. ఇటీవల టూరిజం పాలసీపై శాసనసభలో చర్చించామని, త్వరలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొత్త పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు.
సహజవనరులు మెండుగా ఉన్నాయి
‘వికారాబాద్‌కా హవా... లాకోం రూపాయికా దవా’ అని చేవెళ్ల ఎమ్మెల్యే యా అంటుంటారని సీఎం అన్నారు. వికారాబాద్‌లో చుట్టుపక్కలను ప్రాంతాల కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు . టీబీ వచ్చిన వాళ్లను తీసుకొచ్చి ఇక్క రెండు నెలలు వదిలేస్తే..
ఇక్కడి ప్రకృతి సహజవనరుల కారణంగా మెడిసిన్ లేకుండా జబ్బు నయం అవుతుందన్నారు. త్వరలోనే పెద్దపెద్ద పరిశ్రమల వాళ్లు వికారా ప్రాంతాన్ని ఎకోటూరిజంలో పూర్తి అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు దావోస్‌లో అగ్రిమెంట్ కూడా జరిగిందన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు కేవలం సాంప్రదాయ పంటలే కాకుండా కమర్షియల్ మొక్కలు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొ నాటడం వల్లే సాధారణ రైతు అయిన వనజీవి రామయ్యకు కేంద్రం ప్రద్మశ్రీ ఇచ్చిందని.. ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచానికే తలమానికం..
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రామ్‌దేవ్ ఒక కల కని 25 ఏళ్లుగా కష్టపడి దానిని నిజం చేసుకున్నారని అన్నారు. ఎక్స్పీరియం దేశానికే కాదు ప్రపంచానికి కూడా తలమానికమని ప్రశంసించారు. హైదరాబాద్ అంటే చారిత్ర కట్టడాలు, గొప్ప దేవాలయాలు గుర్తొస్తాయని ఇపపుడు వాటి సరసన ఎక్స్పీరియం కూడా చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ... ఈ ప్రాంతం టూరిజం స్పాట్ కాబోతోందని, రాబోయే రోజుల్లో మరింత రద్దీ పెరిగే చాన్స్ ఉందని.. ప్రస్తుతం ఉన్న రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వీటితో పాటు స్థానికంగా ఉన్న రోడ్లను బాగుచేయాలని కోరారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, నిర్వాహకులు.. పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన గ్రీన్‌హార్ట్ ఆఫీస్ ఇండియా దుశ్చర్ల సతస్యనాయారణను సన్మానించారు. అంతకుముందు ఆసియాలోనే అతిపెద్దదైన హంపీ థియేటర్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడంతో పాటు ఎక్స్పీరియం లోగో, కాపీ టేబుల్ బుక్‌ను సీఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏపీ ఎంపీ సీఎం రమేశ్, సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు యాద మల్ రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో చంద్రకళ, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
అద్భుతమైన కళాఖండం: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... ఎక్స్పీరియం అద్భుతమైన కళాఖండమని, ఇది దేశంలోనే గొప్ప పార్క్ అవుతుందని అన్నారు. అరుదైన సజీవ మొక్కలు, శిల్పా ఇంతకుముందు విదేశాల్లో చూసి ఎంతో టెమ్ట్ అయ్యేవాడినని..అలాంటి మొక్కలు, శిల్పాలు హైదరాబాద్‌లో దొరకడం సంతోషంగా ఉందన్నారు.
తమ ఇంటిముందు మొక్కలతో రామ్‌దేవ్ వేసిన ఫెన్సింగ్ గొప్ప కళాఖండమని, ఆయనలో వ్యాపారవేత్తతో పాటు మంచి కళాకారుడు ఉన్నారన్నారు. కళాహృదయం, ఎంతో తపన ఉంటే తప్ప 25 ఏండ్ల పాటు ప్రయోగాలు చేసి, వివిధ దేశాల నుంచి మొక్కలు, శిల్పాలు ఇక్కడికి తీసురారని ప్రశంసించారు. దీన్ని ఫిల్మ్ షూటింగ్‌కు ఇస్తారా అని తాను అడిగానని, ఫస్ట్ షూటింగ్ తనకే ఇస్తానని చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు.