ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణలో నైపుణ్యమున్న మానవ వనరుల లభ్యత అపారంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన అమెరికా కాన్సులేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, సాంకేతిక నిపుణుల అందుబాటు వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. వ్యాపార, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని శ్రీధర్‌బాబు వివరించారు.
రెండు వారాల్లోనే సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3 వేల కోట్ల పారిశ్రామిక మండలిని జహీరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలిపిందని వివరించారు. నీరు, విద్యుత్ నిరంతరాయంగా అందించే సామర్థ్యం తమ రాష్ట్రానికి ఉందని వివరించారు. రైలు, రోడ్డు, విమాన రవాణా కనెక్టివిటీలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. భేటీలో యూఎస్ కాన్సులేట్ అధికారులు నెల్సన్ కన్నింగ్ హామ్, రెబెకా డ్రేమె, ఫ్రాంక్ టల్లుబో, అఖిల్ బెరి తదితరులు పాల్గొన్నారు.